రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం తెల్లవారుజామున శివరాంపల్లిలో ప్రయాణిస్తున్న ఇన్నోవా కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ముందు భాగంలో చెలరేగిన మంటలను గమనించిన డ్రైవర్.. వెంటనే అప్రమత్తమై కారు నుంచి కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. క్షణాల్లో కారు మెత్తం మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో కారు పూర్తిగా కాలి బూడిదైంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని.. ఫైర్ ఇంజిన్ తో మంటలు అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారు తగలబడిందని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు. ఆరాంఘర్ నుండి జూ పార్క్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న హఫీజ్, పర్వీన్ లు అనే ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు.. వారు క్షేమంగా కారు నుంచి బయటపడ్డారు.