
తిరుమల: తిరుమల కౌస్తుభం పార్కింగ్ వద్ద కారు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. కారులో మంటలు రావడంతో భక్తులు కంగారుపడ్డారు. రోనాల్డ్ డస్టర్ కారు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ కారు అప్పటికే దగ్ధమైంది.
ఆ కారులో ప్రయాణికులు ఒంగోలు నుంచి తిరుమలకు దర్శనానికి వచ్చినట్లు తెలిసింది. కారులో పొగను గుర్తించడంతో ఆ కారులో ఉన్నవాళ్లు వెంటనే దిగిపోయారు. వాళ్లు దిగిన కాసేపటికే కారు మంటల్లో కాలిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తిరుమలలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల పార్కింగ్ విషయంలో డ్రైవర్ల మధ్య మొదలైన గొడవ ఓ డ్రైవర్ మరణానికి కారణమయ్యింది. పోలీస్ కాంప్లెక్స్ దగ్గర పార్కింగ్ విషయంలో డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో కురబలకోటకు చెందిన శివ అనే డ్రైవర్పై ముగ్గురు డ్రైవర్లు దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ( ఏప్రిల్ 15 ) మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివతో గొడవపడ్డ ముగ్గురు డ్రైవర్లు తిరుపతి చెందినవారని తెలుస్తోంది. డ్రైవర్ శివ మృతితో అతని కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.