
పెద్దపల్లి, వెలుగు : వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లి ఒకరు చనిపోయారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కేంద్రం రంగంపల్లికి చెందిన వినీత్రెడ్డి (27) తన స్నేహితులు గాదె అఖిల్, సాయి అల్లం, రోహిత్ రెడ్డితో కలిసి నిమ్మనపల్లి గ్రామం నుంచి పెద్దకల్వల వైపు శుక్రవారం అర్ధరాత్రి కారులో వెళ్తున్నాడు. కారు అదుపుతప్పి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిది. వినీత్ రెడ్డి కారులో ఇరుక్కొని నీట మునిగి చనిపోయాడు.
మిగతా ముగ్గురు బావిలో ఉన్న పైపు సహాయంతో పైకి చేరుకున్నారు. వెంటనే బాధితులు 108, ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది బావిలో ఉన్న వినీత్ మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా వినీత్రెడ్డి అవివాహితుడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుల కోసం సొంతూరు వచ్చాడు. ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు స్నేహితులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. పండుగ సెలవుల్లో పెద్దపల్లికి చేరుకున్న స్నేహితులు సంతోషంగా గడుపుదామని వస్తే ఒకరు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో విషాదం నింపింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.