డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ కాంప్లెక్స్ గేటును ఓ వెహికల్ ఢీకొట్టడంతో వాషింగ్టన్లో కలకలం రేగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో వెహికల్ ను డ్రైవ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ప్రెసిడెంట్ బైడెన్ వైట్ హౌస్ లో లేరని తెలిపారు.
కారును అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారని, అందులో ఏమీ అనుమానాస్పద వస్తువులు దొరకలేదన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనా? లేదంటే అటాక్ కు కుట్ర ఏమైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వైట్‌హౌస్ కాంప్లెక్స్ ఈశాన్య గేటు ముందు 15వ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ రోడ్ ఉన్నందున ట్రాఫిక్ పరంగా యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉందన్నారు.
కాగా, 2017లో ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు.. ఆయన వైట్‌హౌస్‌లో ఉన్న టైంలోనే ఓ దుండగుడు గేటును దూకి లాన్స్‌లో 16 నిమిషాలపాటు కలియదిరిగిన తర్వాత భద్రతా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2020 నుంచీ వైట్‌హౌస్ కాంప్లెక్స్ చుట్టూ గట్టి మెటల్ ఫెన్స్ ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశారు.