హైదరాబాద్‌లో కారు డ్రైవర్ల బాయ్​కాట్ ​ఉద్యమం

  • ఊబర్, ఓలా, ర్యాపిడో తీరును నిరసిస్తూ కమర్షియల్​ డ్రైవర్ల నిరసన  
  • తక్కువ కమిషన్, వైట్ ప్లేట్ వెహికల్స్​ రైడ్స్​పై ఆగ్రహం  
  • తాము ట్యాక్సులు కట్టి మునుగుతున్నామని ఆవేదన  
  • ఆర్టీఏ, అగ్రిగేట్ కంపెనీలు స్పందించట్లేదని బాయ్​కాట్​
  • సర్కారు యాప్​తీసుకురావాలని డిమాండ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ ​పరిధిలో ఊబర్, ఓలా, ర్యాపిడోలను బహిష్కరించాలంటూ తెలంగాణ గిగ్​అండ్​ప్లాట్​ఫామ్​వర్కర్స్​ యూనియన్ ​బాయ్​కాట్​ క్యాంపెయిన్ ​మొదలు పెట్టింది. వేలాది మంది క్యాబ్​డ్రైవర్లు రోజంతా కష్టపడితే అగ్రిగేట్​ కంపెనీలు( ఊబర్, ఓలా, ర్యాపిడో) ఎక్కువ కమీషన్ ​తీసుకుని పొట్టకొడుతున్నాయని యూనియన్​ ఆరోపిస్తోంది. 

ఊబర్, ఓలా, ర్యాపిడో లాంటి సంస్థలు కమర్షియల్​ వాహనాలను (ఎల్లో కలర్ ​నంబర్ ​ప్లేట్) మాత్రమే తీసుకోవాల్సి ఉండగా, వ్యక్తిగత వాహనాలను (వైట్​నంబర్​ప్లేట్​) కూడా తీసుకుంటున్నాయని, దీని వల్ల తాము నష్టపోతున్నామంటున్నారు. మల్టీనేషనల్​ కంపెనీలు, పలు ఐటీ సంస్థలు, కార్లు, ఆటోలు, టూవీలర్స్​ను అద్దెకు తీసుకుంటుండగా, వారికి వైట్​నంబర్​ప్లేట్ల వాహనాలనూ ఇస్తుండడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  అధికారులకు, అగ్రిగేట్​ కంపెనీలకు చెప్పినా పట్టించుకోవడం లేదని నగరంలో బాయ్​కాట్​ఊబర్, ఓలా, ర్యాపిడో క్యాంపెయిన్ ​ప్రారంభించారు. ప్రతి నెల పది రోజులు ఒక్కో అగ్రిగేట్​ కంపెనీని బాయ్​కాట్​చేయాలని పిలుపునిస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే ‘బాయ్​కాట్​ఊబర్’ నడుస్తోందని తెలంగాణ గిగ్​ అండ్​ ప్లాట్​ఫామ్ ​వర్కర్స్ ​యూనియన్​ అధ్యక్షుడు షేక్​సలావుద్దీన్​ తెలిపారు.

సమస్య ఎక్కడ  వచ్చిందంటే..

గ్రేటర్​లో ప్రస్తుతం ఎల్లో ప్లేట్ ​వాహనాలు 1,78 లక్షల వరకు ఉండగా, వైట్​ప్లేట్స్ ​వెహికల్స్ ​22,16,000 వరకు ఉన్నాయి. అగ్రిగేటర్ ​కంపెనీలు లైసెన్సులు తీసుకుని సొంతంగా యాప్స్ రన్​ చేస్తుండడంతో డిమాండ్​ పెరిగి జనాలంతా అందులోనే వెహికల్స్​ బుక్ ​చేసుకుంటున్నారు. దీంతో సుమారు 1.15 లక్షల ఎల్లో ప్లేట్స్​ వాహనాలు,  35 వేల నుంచి 40 వేల వరకు వైట్​ప్లేట్​వాహనాలు అగ్రిగేట్​ కంపెనీల్లో రిజిస్టర్​ చేసుకుని ట్రిప్పులు కొడుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఎల్లో ప్లేట్స్​ వాహనదారులు లేవనెత్తుతున్న ఓ అంశం ఇప్పుడు చర్చకు దారి తీసింది. 

అదేమిటంటే తాము నిబంధనల ప్రకారం ఆర్టీఏకు ఇన్సూరెన్స్, ఫిట్​నెస్​, పర్మిట్ల కోసం ఏడాదికి రూ.25 వేలు కడుతున్నామని, కానీ, వైట్​ప్లేట్​(డొమెస్టిక్) కార్ల నిర్వాహకులు అవేవీ కట్టకుండానే యథేచ్ఛగా అగ్రిగేట్​ కంపెనీల్లో నడుపుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.అలాగే అగ్రిగేట్​కంపెనీల్లో అదనంగా టూ వీలర్లు కూడా వచ్చి చేరడంతో తమకు గిరాకులు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే వాహనాలను కమర్షియల్​అవసరాలకు ఉపయోగిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 

శ్రమ దోపిడీ కూడా..

అగ్రిగేట్​ కంపెనీల్లో క్యాబ్స్​ రిజిస్టర్ ​చేసుకుని బండి నడిపించి లాభ పడడం కంటే శ్రమ దోపిడీకి గురవుతున్నామని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. సుమారు రూ. 100 వస్తే అందులో రూ.30  కట్ చేసుకుని రూ. 70 మాత్రమే ఇస్తున్నారని అంటున్నారు. కారు తమదని, పెట్రోల్, డీజిల్​తమదని, యాప్​ పేరున బుక్​చేసుకున్నందుకు సుమారు 30 శాతం తీసుకోవడం దారుణమని వాపోతున్నారు. వైట్​ప్లేట్​కార్లు కూడా పోటీకి రావడం, రాను రాను అవి పెరుగుతుండడంతో తాము పోటీలో నిలబడలేకపోతున్నామంటున్నారు. దీంతో తాము పస్తుటుండాల్సిన పరిస్థితి వస్తోందని, ఈఎంఐలు కూడా కట్టే స్థితిలో కూడా లేక ఉన్న కార్లను అమ్ముకోవాల్సి వస్తుందంటున్నారు.

10 శాతం కమీషన్​ తీస్కుని సర్కారే యాప్​ తేవాలి

గతంలో సీఎం రేవంత్​రెడ్డిని కలిసి సమస్య చెప్పుకుంటే ప్రభుత్వమే యాప్​క్రియేట్​చేసి డ్రైవర్లకు ఉపాధి చూపిస్తుందని ఆయన హామీ ఇచ్చారని తెలంగాణ గిగ్​అండ్​ప్లాట్​ఫామ్​వర్కర్స్​యూనియన్​నేత షేక్​సలావుద్దీన్​చెప్పారు. ఊబర్​, ఓలా, ర్యాపిడ్​మాదిరిగానే యాప్​ తెచ్చి కనీసం 10 శాతం కమీషన్​తీసుకున్నా సర్కారుకు కూడా ఆదాయం వస్తుందన్నారు. దీనివల్ల కార్పొరేట్​వ్యవస్థ పెత్తనం తగ్గి డ్రైవర్లు మంచి ఆదాయంతో బతికే ఛాన్స్​ఉంటుందన్నారు.  

అందుకే బాయ్​కాట్​ ఉద్యమం 

ఎవరికి మొర పెట్టుకున్నా స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాయ్​కాట్​ఉద్యమానికి పిలుపునివ్వాల్సి వచ్చిందని తెలంగాణ గిగ్​ అండ్ ​ప్లాట్​ఫామ్​వర్కర్స్​ యూనియన్​చెబుతోంది. ఈ బాయ్​కాట్​ఉద్యమానికి ఇప్పటివరకు 30 వేల మంది డ్రైవర్లు మద్దతు పలుకుతున్నారని, దీనివల్ల ఆయా సంస్థలను మేల్కొలిపి తమ డిమాండ్లను నెరవేర్చుకోవడమే లక్ష్యమంటోంది. 

ప్రతి నెలలో పది రోజులు ఊబర్, మరో పది రోజులు ఓలా, ఇంకో పది రోజులు ర్యాపిడో బాయ్​కాట్​ చేస్తామంటున్నారు. ప్రస్తుతం ఊబర్ బాయ్​కాట్​ఉద్యమం నడుస్తోందన్నారు. తమ డ్రైవర్లు ఊబర్​ బుకింగ్​వస్తే బుక్​ చేసిన వారికి ‘బాయ్​కాట్’ ఉద్యమం గురించి మెసేజ్​పంపి రైడ్​ క్యాన్సిల్​చేస్తున్నామని చెప్పారు. ​దీనివల్ల ఇప్పటికే ఎయిర్​పోర్ట్స్, ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్స్, రైల్వేస్టేషన్ల దగ్గర ఊబర్​కు క్యాబ్​లు దొరక్క తమ సమస్య వారి దగ్గరికి చేరిందన్నారు. కమర్షియల్ రిజిస్ట్రేషన్ లేకుండా పని చేసే ఫోర్​వీలర్, ​టూ వీలర్ వాహనాలను నిషేధించి, తమకు కమీషన్​ పెంచేవారకు బాయ్​కాట్​ఉద్యమం ఆపేది లేదన్నారు.  

స్పందించని ఆర్టీఏ అధికారులు  

ఊబర్, ఓలా, ర్యాపిడోల్లో నడుస్తున్న వైట్ ప్లేట్ల కార్లపై చర్యలు తీసుకోవాలని తాము ఆర్టీఏ అధికారులను కలిసి రిక్వెస్ట్ చేశామని, అయినా వారు పట్టించుకోవడం లేదని తెలంగాణ గిగ్​అండ్​ప్లాట్​ఫామ్​వర్కర్స్​యూనియన్​ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆర్టీఏ అధికారులు కూడా వైట్​ప్లేట్​పెట్టుకుని అగ్రిగేట్​కంపెనీల్లో నడుపుతున్నవారిని గుర్తించడం కష్టమని, ఎవరైనా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. కానీ, అగ్రిగేట్​కంపెనీలకే వైట్​ప్లేట్​కార్లను తీసుకోవద్దని డైరెక్ట్​గా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు.