రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదపుతప్పి హైదర్ గూడ వద్ద డివైడర్ ను ఢీకొని బోల్తా కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును తొలగించి..ట్రాఫిక్ క్లియర్ చేశారు. మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.