రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీ తెల్లవారుజామున హిమాయత్ సాగర్ సమీపంలో మితిమీరిన వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ప్రయాణించిన వారిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంతో రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం శంషాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగం, మద్యం మత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.