- మానకొండూర్ మండలంలోని జాలగుట్ట సమీపంలో ప్రమాదం
కరీంనగర్: మానకొండూర్ మండలంలోని జాలగుట్ట సమీపంలో వరంగల్- కరీంనగర్ ప్రధాన రహదారి పై కారు లారీ ఢీన్నాయి. ఈ ప్రమాదంలో భార్యా భర్తలు మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న వీరి పిల్లలకు గాయాలయ్యాయి. వరంగల్ కాశీబుగ్గకు చెందిన సురేందర్ (42), ఆయన భార్య మాధవి(40), వారి పిల్లలు అశోక్, మేఘన కలసి కారులో వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు -లారీ పరస్పరం ఢీకొనడంతో కారు నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న సురేందర్ (42) తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోగా.. భార్య మాధవి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉన్న వారి పిల్లలు మేఘన, అశోక్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.