- ప్రాణాలతో బయటపడ్డ మరొకరు
- అతివేగం, సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
- యాదాద్రి జిల్లా జలాల్పూర్లో ఘటన
యాదాద్రి/భూదాన్ పోచంపల్లి, వెలుగు: కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్లో జరిగింది. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఆర్టీసీ కాలనీకి చెందిన వంశీ గౌడ్ (23), దిఘ్నేశ్(22), ఇంద్రపల్లి హర్షవర్ధన్(21), బాలు (19), జెల్ల వినయ్ (20)తో పాటు బోడుప్పల్ కు చెందిన మేడబోయిన మణికంఠ స్నేహితులు. వీరందరూ జాలీ ట్రిప్ కోసం శుక్రవారం రాత్రి 12 గంటలకు ఇండ్ల నుంచి బయలుదేరారు. బయటకు వెళ్తున్న విషయం పేరెంట్స్‌కు కూడా చెప్పలేదు. వీళ్లందరూ స్విఫ్ట్ డిజైర్ కారులో బయలుదేరి, మార్గమధ్యలో మద్యంసేవించారు. అనంతరం భోజనం చేయడానికి జాతీయ రహదారిపై హోటల్‌ను వెతుక్కుంటూ తెల్లారేదాకా కారులో తిరిగారు. భూదాన్ పోచంపల్లిలో ఈత కల్లు బాగుంటుందని, తాగి వెళ్దామని వారిలో ఒకరు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చెప్పారు. దీంతో పోచంపల్లి బయల్దేరారు. అప్పటికే మద్యం తాగినందున అందరూ మత్తులో ఉన్నారు. ఆ మత్తులోనే వంశీ కారును డ్రైవ్ చేస్తుండగా పక్కనే మణికంఠ కూర్చున్నాడు.
మిగిలిన నలుగురు వెనుక సీటులో కూర్చున్నారు. కారు వేగంగా నడుపుకుంటూ జలాల్పూర్వద్దకు చేరుకున్నారు. అయితే గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద మూల మలుపు ఉండడంతో తొలుత గమనించలేదు. ఆ తర్వాత వంశీ సడెన్ గా కారు బ్రేక్ వేశాడు. దీంతో వేగంగా ఉన్న కారు రెండు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. కారు డోర్‌కు లాక్పడడంతో ఐదుగురు యువకులు ఊపిరి ఆడక మృతి చెందారు. మణికంఠ అద్దం పక్కనే ఉండడంతో పగులకొట్టుకొని బయటకు వచ్చి, ఈదుకుంటూ చెరువుకట్ట మీదికి వచ్చాడు. అనంతరం దారిన వెళ్తున్న వారికి విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీయించారు. కారులో ఉన్న ఐదు మృతదేహాలను పోస్టుమార్టం కోసం భువనగిరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చౌటుప్పల్ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఎస్సై భాస్కర్‌రెడ్డి వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీలను తల్లిదండ్రులకు అప్పగించారు.