
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ గుడి మలుపు దగ్గర అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి... బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా పరారయ్యాడు.
ఈ ప్రమాదం జనవరి 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని.. నగరంలో ఉన్న ఓ క్లబ్ లో పనిచేస్తున్న తారక్ గా పోలీసులు గుర్తించారు. సంఘటనాస్థలంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొట్టిన కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.