పోలీసులపైకి దూసుకొచ్చిన కారు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఘటన

పోలీసులపైకి దూసుకొచ్చిన కారు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఘటన
  • ఓ కానిస్టేబుల్‌‌ మృతి, మరొకరికి గాయాలు
  • కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఘటన
  • మరో రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

లింగంపేట, వెలుగు: డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులపైకి కారు దూసుకుపోవడంతో ఓ కానిస్టేబుల్‌‌ చనిపోగా, మరో కానిస్టేబుల్‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాంధారి పోలీస్‌‌స్టేషన్‌‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వడ్ల రవికుమార్‌‌ (37), సుభాశ్‌‌ బుధవారం రాత్రి బస్టాండ్‌‌ ఏరియాలో డ్యూటీ చేస్తున్నారు. తెల్లవారుజామున 2.50 గంటల టైంలో ఓ కారు స్పీడ్‌‌గా వచ్చి కానిస్టేబుళ్లను ఢీకొట్టింది. ప్రమాదంలో రవికుమార్‌‌ అక్కడికక్కడే చనిపోగా, సుభాశ్‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్సై ఆంజనేయులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కామారెడ్డి హాస్పిటల్‌‌కు తరలించారు. 

గాంధారి మండల కేంద్రానికి చెందిన సన్నిత్‌‌ మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సన్నిత్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రవికుమార్‌‌ స్వగ్రామం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమె గ్రామం కాగా భార్యాపిల్లలతో కలిసి దేవునిపల్లిలో ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ రాజేశ్‌‌ చంద్ర కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌‌కు చేరుకొని రవికుమర్‌‌ మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అధికార లాంఛనాలతో దేవునిపల్లి గ్రామంలో రవికుమార్‌‌ అంత్యక్రియలు నిర్వహించారు. 

ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన వ్యాన్‌‌, ఇద్దరు మృతి
అల్లాదుర్గం/పెద్దశంకరంపేట, వెలుగు : హైవే పక్కన ఆగి ఉన్న బస్సును డీసీఎం ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు చనిపోగా, మరో 11 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గురువారం తెల్లవారుజామున మెదక్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఏపీలోని విజయనగరం జిల్లా వెంకాడ మండలం సారిపల్లికి చెందిన పలువురు ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ బస్సులో తీర్థయాత్రలకు వెళ్లారు. మహారాష్ట్రలోని తుల్జాపూర్‌‌ భవానీని దర్శించుకొని హైదరాబాద్‌‌కు వెళ్తున్న క్రమంలో పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద హైవే పక్కన బస్సు ఆపారు.

ఇదే టైంలో హైవేపై వచ్చిన ఓ డీసీఎం బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో నారాయణమ్మ (50) స్పాట్‌‌లోనే చనిపోగా మరో 12 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ సూరపమ్మ (60) చనిపోయింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పెద్దశంకరంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. 

డివైడర్‌‌ను ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
జహీరాబాద్, వెలుగు : కారు డివైడర్‌‌ను ఢీకొట్టడంతో ఒకరు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌లో గురువారం జరిగింది. జహీరాబాద్ ఎస్సై కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌‌నగర్‌‌ చెందిన ఫరీదుద్దీన్‌‌ (40), అలీముద్దీన్‌‌, నాసిర్‌‌, ముదాసిర్‌‌, రజువుద్దీన్‌‌లు రంజాన్‌‌ షాపింగ్‌‌కోసం ముంబైకి వెళ్లారు. షాపింగ్‌‌ పూర్తి చేసుకొని కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో జహీరాబాద్‌‌ సమీపంలోని పాత ఆర్టీఏ చెక్‌‌పోస్ట్‌‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌‌ను ఢీ కొట్టింది. ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు జహీరాబాద్‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ ఫరీదుద్దీన్‌‌ చనిపోయాడు. మిగిలిన నలుగురిని హైదరాబాద్‌‌లోని ఉస్మానియా హాస్పిటల్‌‌కు తరలించారు.