హైదరాబాద్ తో పాటు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. శనివారం ( ఆగస్టు 31, 2024 ) తెల్లవారుజాము నుండి నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల రోడ్లన్నీ జలమయం అవ్వటంతో ఆఫీసులకు వెళ్లేవారు, స్కూళ్లకు వెళ్లే చిన్నారులు ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉండగా.. మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలంలోని మల్లేపల్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా రహదారి జలమయం అయ్యింది. ఈ క్రమంలో ఓ కారు వర్షపు నీటిలో చిక్కుకుంది.
Also Read :- జాతీయ రహదారిపై పోటెత్తిన వరద ఎక్కడంటే ?
అటుగా వెళ్తున్న స్థానికులు చిక్కుకున్న కారును చూసి బయటకు తీశారు.బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడటంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది వాతావరణశాఖ.