ఏపీలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు విజయవాడను వరదలతో ముంచెత్తాయి. వర్షాలు తగ్గుముఖం పెట్టటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ వాసులు బుడమేరుకు మళ్ళీ వరద ఉధృతి పెరగటంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో బుడమేరు పొంగిపొర్లుతోంది.. ఈ క్రమంలో గన్నవరం నుండి కంకిపాడు వెళ్ళే ప్రధాన రహదారి జలమయం అయ్యింది. గన్నవరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది.
ఫణి అనే వ్యక్తి హైదరాబాదు నుండి తన స్వగ్రామం మచిలీపట్నం వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న గన్నవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.