జూన్​లో2,75,788 కార్లు అమ్ముడైనయ్‌

జూన్​లో2,75,788 కార్లు అమ్ముడైనయ్‌
  • మొత్తం వెహికల్స్​ అమ్మకాలు 16,11,300 యూనిట్లు

న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల (చిప్‌) సరఫరా మెరుగుపడటంతో ఈ ఏడాది జూన్‌‌‌‌లో భారతదేశంలో కార్ల హోల్‌‌సేల్స్ సంవత్సరం లెక్కన 19 శాతం పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్​) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం,  2021 జూన్​లో 2,31,633 ప్యాసింజర్ వెహికల్ (పీవీ) యూనిట్లు డీలర్లకు వెళ్లగా, ఈసారి 2,75,788 యూనిట్లను పంపించారు. ఇదేకాలంలో టూవీలర్ల హోల్‌‌సేల్స్ 10,60,565 యూనిట్ల నుంచి 13,08,764 యూనిట్లకు పెరిగాయి. త్రీవీలర్​ అమ్మకాలు  2021 జూన్​లో 9,404 యూనిట్ల నుండి పోయిన నెలలో 26,701 యూనిట్లకు పెరిగాయి.  అన్ని సెగ్మెంట్లలో అమ్మకాలు 13,01,602 యూనిట్ల నుంచి 16,11,300 యూనిట్లకు పెరిగాయి.  పీవీ డిస్పాచ్​లు కిందటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ కాలంలో 6,46,272 యూనిట్లు కాగా, ఈసారి ఇవి 41 శాతం పెరిగి 9,10,431 యూనిట్లకు చేరాయి. కమర్షియల్​ వెహికల్స్  అమ్మకాలు ఇదేకాలంలో 1,05,800 యూనిట్ల నుంచి 2,24,512 యూనిట్లకు పెరిగాయి. టూవీలర్ల డిస్పాచ్​లు 24,13,608 యూనిట్ల నుంచి 37,24,533 యూనిట్లకు ఎగిశాయి.  త్రీవీలర్‌‌ల డిస్పాచ్​లు  24,522 యూనిట్ల నుంచి 76,293 యూనిట్లకు పెరిగాయి.  మొత్తం అమ్మకాలు పోయిన ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో 31,90,202 యూనిట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో అమ్మకాలు 49,35,870 యూనిట్లకు పెరిగాయి.

మొదటి క్వార్టర్​లో పీవీల అమ్మకాలు 9.1 లక్షల యూనిట్లుగా ఉండగా, టూవీలర్ల డిస్పాచ్​లు 37.25 లక్షల యూనిట్లుగా రికార్డయ్యాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. కమర్షియల్​ వెహికల్స్ అమ్మకాలు 2.25 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయని వివరించారు. " ప్రభుత్వం ధరల ఒత్తిడిని తగ్గించడానికి ఇటీవల చాలా చర్యలు తీసుకుంది. పెట్రోల్,  డీజిల్‌‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది.  ఉక్కు,  ప్లాస్టిక్ ధరలను తగ్గేలా చేసింది. ఫలితంగా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు ఎంతో మేలు జరిగింది.  సీఎన్‌జీ ధరలనూ తగ్గించాలి. పోయిన ఏడు నెలల్లో విపరీతమైన పెరుగుదల ఉంది. సీఎన్‌జీ ధరలు తగ్గితే సామాన్యులకు మేలు జరుగుతుంది. ప్రజా రవాణా ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది" అని మీనన్ చెప్పారు.