మెదక్​లో కారు బీభత్సం.. మున్సిపల్​ కార్మికుడు మృతి

మెదక్​లో కారు బీభత్సం.. మున్సిపల్​ కార్మికుడు మృతి
  • పదేండ్ల బాలుడి పరిస్థితి విషమం
  • బిస్కెట్లు కొనుక్కోవడానికి రోడ్డు దాటుతుండగా ఘటన  
  • పరారీలో నిందితులు 
  • గంజాయి మత్తే కారణమా? 

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్ పట్టణ శివారులోని వడ్డెర కాలనీ వద్ద ఆదివారం ఉదయం ఓ కారు భీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు పారిశుద్ధ్య కార్మికుడిని, బాలుడిని ఢీకొట్టడంతో కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే పార్క్​ చేసిన బైక్​ను గుద్దుకుని చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది.

ఆ టైంలో పెద్దగా జన సంచారం లేకపోవడంతో పెద్దగా ప్రాణ నష్టం సంభవించలేదు. మెదక్​ మండలం మక్తభూపతిపూర్​గ్రామానికి చెందిన కర్రె మైసయ్య (50) మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతడు భార్య రత్నమ్మతో పాటు ఇద్దరు కొడుకులతో కలిసి మెదక్​లోని ఆజంపుర వీధిలో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వడ్డెర కాలనీ వద్ద మరికొంతమంది కార్మికులతో కలిసి మైసయ్య రోడ్డు ఊడుస్తున్నాడు. అప్పుడే మెదక్​ టౌన్​కు చెందిన నలుగురు యువకులు మెదక్​ మండలం మంబోజిపల్లికి కారులో వెళ్లి టీ తాగి వస్తున్నారు.

ఓవర్​స్పీడ్​లో ఉండడంతో అదుపు తప్పి ముందు రోడ్డు ఊడుస్తున్న మైసయ్యను ఢీకొట్టుకుంటూ వెళ్లారు. అదే టైంలో బిస్కెట్లు కొనుక్కోవడానికి రోడ్డు దాటుతున్న వడ్డెర కాలనీకే చెందిన పదేండ్ల దండుగుల సాత్విక్​ను సైతం ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో  మైసయ్య​ అక్కడికక్కడే చనిపోగా, సాత్విక్​ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సాత్విక్​ను హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్​కు తరలించారు. బాలుడి తల్లిదండ్రులు రాజమణి, నర్సింహులు వడ్డెర పని చేసుకుంటూ బతుకుతున్నారు. మెదక్​ టౌన్​పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా గంజాయి మత్తులో కారు నడపడంతో ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.