వీడియో స్టోర్స్.. పార్లర్స్‌కి వెళ్లి వీసీడీ, సీడీ, డీవీడీలు తెచ్చుకునే కాలం పోయింది. పెన్ డ్రైవ్ నుంచి ‘వీడియో ఆన్ డిమాండ్’కి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడంతా వేళ్ల మీదే నడిచిపోతోంది. జస్ట్ ఒక్క క్లిక్‌తో కావాల్సిన వీడియోను చూస్తున్నాం. డిమాండ్‌కు తగ్గట్లు వీడియో కంటెంట్‌ను యూజర్‌కి అందించడంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సక్సెస్ అవుతున్నాయి. కానీ, వాటి వల్ల జరుగుతున్న డ్యామేజ్‌ను గుర్తించాల్సిన అవసరం ఉందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. స్ట్రీమింగ్ సర్వీసుల వల్ల వాతావరణంలోకి కార్బన్ వాయువులు
ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతున్నాయంటున్నారు సైంటిస్టులు.
సైజు వల్లే ఇదంతా!
ఇప్పటికే చాలా సర్వీసులు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని సర్వీసులు రాబోతున్నాయి. వెబ్ బేస్డ్ వీడియో ట్రాఫిక్ 2017 నుంచి 2022 మధ్య నాలుగు రెట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. 2022 నాటికల్లా ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సోషల్ మీడియా హవా తగ్గి.. వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు పుంజుకుంటాయని ఒక అంచనా. అది సుమారు 80 శాతానికి చేరవచ్చని అనుకుంటున్నారు. ఆ లెక్కన పొల్యూషన్ ప్రమాదస్థాయికి చేరుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు వీడియోల్ని చూసేందుకు ఉపయోగించే ఎక్విప్‌మెంట్(కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్…) సైజులో కూడా మార్పులొస్తున్నాయి. ఈ మార్పుల వల్లే ‘డిజిటల్ వీడియో టెక్నాలజీ’కి క్వాలిటీ హంగుల్ని చేర్చాల్సి వస్తోంది. తద్వారా స్ట్రీమింగ్ వీడియోల సైజు ఎక్కువగా ఉంటోంది. 4కె, 8కె మార్పులు ఇందులో ఒక భాగమే!. సపోజ్.. హెచ్‌డీ వీడియోల కంటే 4కె వీడియోల కోసం 30 శాతం ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతోంది. 8కె స్క్రీన్స్‌కి ఈ ఎనర్జీ మరింత ఎక్కువ కావాలి.
ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసులలో ఉండే వీడియోలు డిజిటల్ ఫార్మాట్‌లో ఉంటాయి. ఈ డిజిటల్ వీడియోలు సైజులో చాలా పెద్దవి. దీనికి తోడు హయ్యర్ డెఫినిషన్ ఫార్మాట్ అనేది ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వస్తోంది. హెచ్‌డీ, 4కె, 8కె.. ఇలాగన్న మాట. యూజర్ ఒక వీడియోను ఎంత క్వాలిటీతో చూస్తే అంత ఇంటర్నెట్ డేటా అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తానికి అంతే ఎక్కువ ఎనర్జీ అవసరం. కంప్యూటర్/డివైజ్‌కి కావాల్సిన ఈ బఫరింగ్ ఎనర్జీని ‘డేటా సెంటర్’లు అందిస్తాయి. ఈ డేటా సెంటర్స్ ఉపయోగించే ఎలక్ట్రిసిటీ వల్ల కార్బన్ వాయువులు గాల్లోకి విడుదల అవుతాయి. ప్రారంభంలో స్ట్రీమింగ్ సర్వీసుల డేటా సెంటర్స్ 0.3 శాతం వాయువులను మాత్రమే గాల్లోకి వెదజల్లేవి. కానీ, వాడకం పెరుగుతున్న కొద్దీ పొల్యూషన్ పర్సంటేజ్ పెరుగుతూ వస్తోంది. ఎన్విరాన్‌మెంటల్ మ్యాగజైన్ ‘నేచర్’ కథనం ప్రకారం.. ప్రస్తుతానికి ఈ డేటా సెంటర్స్ పర్యావరణానికి చేస్తున్న డ్యామేజ్ ఊహించని రేంజ్‌లోనే ఉందట!.
ఆరేళ్లలో డబుల్ పొల్యూషన్
వీడియో స్ట్రీమింగ్‌లో ఒకప్పుడు ‘పోర్న్’ బిగ్గెస్ట్ సెక్టార్‌గా ఉండేది. తర్వాతి రోజుల్లో దాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అధిగమించాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ ట్రాఫిక్‌లో 34 శాతం వాటా స్ట్రీమింగ్ సర్వీసులదే. అయితే వీటి వల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ స్థాయిలోనే రిలీజ్ అవుతోంది. ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్‌లో ఒక షోగానీ, సినిమాగానీ అరగంట చూశారనుకోండి. సుమారు కేజీన్నర కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ వాయువులు వాతావరణంలోకి విడుదల అవుతాయి. సాధారణంగా ఒక వెహికిల్‌లో నాలుగు మైళ్ల దూరం ప్రయాణిస్తే ఈ రేంజ్‌లో పొల్యూషన్ రిలీజ్ అవుతుంది. అంటే.. నెట్‌ఫ్లిక్స్ లాంటి ఒక స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా కూర్చున్న చోటు నుంచి కదలకుండా యూజర్స్ అరగంటలోనే ఇంతస్థాయిలో కాలుష్యానికి కారణం అవుతున్నారన్న మాట.
ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే కాదు.. అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు(అమెరికా), హాట్‌స్టార్, ఇంకా లోకల్ స్ట్రీమింగ్ సర్వీసుల వల్ల ఇదే రేంజ్‌లో పొల్యూషన్ జరుగుతోంది. అయితే ఇందులో ఎక్కువ వాటా మాత్రం నెట్‌ఫ్లిక్స్‌దే. షిఫ్ట్ ప్రాజెక్ట్ అనే ఆర్గనైజేషన్ చేపట్టిన సర్వేలో.. ‘ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు కిందటి ఏడాది రిలీజ్ చేసిన పొల్యూషన్.. స్పెయిన్‌లో తారాస్థాయికి చేరిన కాలుష్యానికి సమానంగా ఉంది’ అని తేలింది. వచ్చే ఆరేళ్లలో ఈ పొల్యూషన్ డబుల్ అయ్యే అవకాశం ఉందని షిఫ్ట్ ప్రాజెక్ట్ టీం చెబుతోంది.
యూజర్లు ఏదో సరదాగా చూస్తున్నామనే తప్ప.. కాలుష్యానికి కారణం అవుతున్నారనే ఆలోచన చేయట్లేదని ఈ సర్వే వెల్లడించింది.
ఇట్లా తగ్గించాలె
2030 నాటికల్లా 4.1 శాతం గ్లోబల్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటామని ‘హువాయ్’ కంపెనీ ఓపెన్‌గా చెప్తోంది. మిగతా సర్వీసులు కూడా డేటా సెంటర్స్ కోసం ఎక్కువ మోతాదులో విద్యుత్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. ఈ నిర్ణయాల వల్ల పొల్యూషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యకు చెక్ పడాలంటే రెండు మార్గాలు ఉన్నాయని అమెరికాకు చెందిన డేటా సెంటర్స్ ఎక్స్‌పర్ట్ డేల్ శార్టర్ చెప్తున్నాడు. ‘వచ్చే ఐదు నుంచి పదేళ్లలో ఎనర్జీ వినియోగం తగ్గాలంటే.. ఐటీ ఎక్విప్‌మెంట్‌లో మార్పులు చేయాలి. మరోవైపు డేటా సెంటర్‌లు కూడా ఎనర్జీని అందించే ఫెర్‌ఫార్మెన్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. రెన్యువబుల్ ఎనర్జీకి డేటా సెంటర్స్ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడే ఎనర్జీ సేవింగ్ అవుతుంది. తద్వారా పొల్యూషన్ తగ్గుతుంది’ అని డేల్ శార్టర్ అంటున్నాడు.
యూజర్స్ రెస్పాన్సిబిలిటీ
ఇంకోవైపు యూజర్స్ కూడా తమ వంతుగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ‘డివైజ్‌లో ఆటో ప్లే బటన్‌ని డిజేబుల్ చేయాలి. ఒకవేళ వైఫై నెట్‌వర్క్‌తో వీడియోల్ని చూడాలనుకున్నా సరే లోయర్ డెఫినిషన్ ఫార్మాట్స్‌లోనే వీడియోల్ని చూడాలి. స్ట్రీమింగ్ సర్వీసులు మాత్రమే కాదు.. యూట్యూబ్ లాంటి బఫరింగ్ సర్వీసులకూ ఇది వర్తిస్తుంది. డబ్బులిచ్చి మరీ స్మార్ట్ డివైజ్‌లో లో–క్వాలిటీతో చూడాల్సిన అవసరం ఏముందని? కొందరు యూజర్లు అడగవచ్చు. కానీ, ఎంత ఎక్కువ చూస్తే.. పర్యావరణానికి అంత నష్టం అని గుర్తించాలి’ అంటున్నారు నిపుణులు.