సీపీఆర్​తో ప్రాణాలు కాపాడొచ్చు : కార్డియాలజిస్ట్ శరత్ రెడ్డి

మాదాపూర్, వెలుగు :  ఆకస్మిక గుండె మరణాలకు సీపీఆర్ తో చెక్ పెట్టి.. ప్రాణాలను కాపాడొచ్చని మెడికవర్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి తెలిపారు.  శుక్రవారం ‘వరల్డ్ హార్ట్ డే’ సందర్భంగా మాదాపూర్​లోని మెడికవర్ హాస్పిటల్​లో నిఫ్ట్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) స్టూడెంట్లకు డాక్టర్లు సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శరత్ రెడ్డి మాట్లాడుతూ.. సీపీఆర్ అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాసెస్ అని అన్నారు. కార్డియాక్ అరెస్ట్​కు గురైనప్పుడు శరీర అవయవాలకు రక్త ప్రసరణను కొనసాగించడమే సీపీఆర్ లక్ష్యమన్నారు. 

 సడెన్ కార్డియాక్ అరెస్ట్ మెడికల్ ఎమర్జెన్సీపై స్పందించేందుకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి హార్ట్ సేవర్స్ పేరుతో మెడికవర్ హాస్పిటల్స్  దేశవ్యాప్తంగా సీపీఆర్ పై శిక్షణ ఇస్తోందన్నారు. ఈ ప్రచారంలో భాగంగా స్కూల్స్, రెసిడెన్షియల్ పోటీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, పోలీస్ స్టేషన్లు, ఇతర పబ్లిక్ ప్లేసెస్​లో సీపీఆర్ పై అవగాహన కల్పించామన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజిండ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. కార్డియోపల్మనరీ రెససిటేషన్ విలువను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో మెడికవర్ డాక్టర్లు, సిబ్బంది, నిఫ్ట్ కాలేజీ స్టూడెంట్లు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.