న్యూఢిల్లీ: భారతదేశం అంతటా అన్ని ఏటీఎంలలో కార్డ్‌లెస్ క్యాష్‌విత్‌డ్రాయల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకులకు సూచించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ప్రకటించింది. ఎన్సీపీఐ డెవెలప్ చేసిన యూపీఐ ఇంటర్‌ఫేస్ సహాయంతో ఈ విధానం బ్యాంక్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఈసారి ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదీ ఒకటి. “ప్రస్తుతం ఏటీఎంల ద్వారా కార్డ్‌లెస్ క్యాష్‌విత్‌డ్రాయల్ సౌకర్యం కొన్ని బ్యాంకులకే ఉంది. ‘‘యూపీఐని ఉపయోగించి అన్ని బ్యాంకులు ఏటీఎం నెట్‌వర్క్‌లలో కార్డ్‌లెస్ క్యాష్‌విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని మేం ప్రపోజ్చేశాం. ఫిజికల్ కార్డ్‌ల అవసరం లేకపోవడం వల్ల కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను అడ్డుకోవచ్చు’’ అని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
క్యూఆర్ కోడ్‌తో కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్
పేరులోనే ఉన్నట్టుగా కార్డ్‌లెస్ క్యాష్‌విత్‌డ్రాయల్ అంటే.. ఏటీఎంల నుండి డబ్బును విత్‌డ్రా చేసేటప్పుడు బ్యాంక్ కస్టమర్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. యూపీఐ ద్వారా సిస్టమ్ ఎలా పని చేస్తుందో ఆర్బీఐ పేర్కొనలేదు కానీ ఇప్పుడు బ్యాంక్ ఏటీఎంలలో ఈ ఆప్షన్ ఉంటుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. కస్టమర్ తన యూపీఐ పిన్‌ను నమోదు చేసిన తర్వాత క్విక్ రెస్పాన్స్ కోడ్‌ని స్కాన్ చేసి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
ప్రస్తుతం కార్డులు లేకుండా
డబ్బు విత్‌డ్రా చేయడం ఎలా?
ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ వంటి కొన్ని బ్యాంకులు కార్డును ఉపయోగించకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. రూ.10 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకునే స్టేట్ బ్యాంక్ కస్టమర్లు కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్ సదుపాయాన్ని ఇలా వాడాలి.
స్టెప్ 1: స్టేట్ బ్యాంక్ యాప్ ‘యోనో’ను డౌన్‌లోడ్ చేసుకోండి
స్టెప్ 2: మీ సమీపంలోని బ్యాంక్ ఏటీఎంకి వెళ్లండి
స్టెప్ 3: ‘విత్‌డ్రా యోనో క్యాష్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 4: మీకు కావాల్సిన మొత్తాన్ని (రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ) ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని ఇవ్వాలని అడుగుతూ స్క్రీన్ పాప్ అప్ వస్తుంది.
స్టెప్ 5: కార్డ్ హోల్డర్లు లావాదేవీని పూర్తి చేయడానికి ఏటీఎం స్క్రీన్‌లో ఎంటర్ చేయాల్సిన ఓటీపీ మొబైల్‌కు వస్తుంది. ఇది ఎంటర్ చేస్తే డబ్బు వస్తుంది.
‘‘యూపీఐ ద్వారా కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్ల విధానాన్ని తీసుకొస్తామంటూ ఆర్బీఐ ఇటీవల చేసిన ప్రకటనను స్వాగతిస్తు న్నాం. అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ పెరిగింది. ఆర్బీఐ నిర్ణయం వల్ల యూజర్లు టెక్నాలజీని మరింత బాగా వాడుకోగలుగుతారు. యూపీఐ వాడకం పెరగడంతోపాటు కార్డు మోసాలు తగ్గుతాయి. రిటైల్ కస్టమర్లందరికీ ఈ సదుపాయం ఎంతో ప్రయోజనకరం. ఎకానమీకి కూడా మేలు జరుగుతుంది”
- భాస్కర్ ఛటర్జీ, ఈజ్టాప్