క్రేన్ ​కూలిన ఘటనలో కేర్ ​బ్లడ్​ బ్యాంక్ ​ధ్వంసం

క్రేన్ ​కూలిన ఘటనలో కేర్ ​బ్లడ్​ బ్యాంక్ ​ధ్వంసం

బషీర్​బాగ్, వెలుగు: సిటీలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అబిడ్స్ లో నిర్మాణంలో ఉన్న నార్త్​స్టార్​కు చెందిన 20 అంతస్తుల భవనం వద్ద భారీ క్రేన్ కూలిన సంగతి తెలిసిందే. క్రేన్ పక్కనే ఉన్న ఓ భవనంపై పడటంతో పై అంతస్తు స్లాబ్ మొత్తం కూలింది. అదే భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఆరోగ్య పేరుతో ప్రైవేట్​హాస్పిటల్ నడుస్తోంది. పేషెంట్లు భయబ్రాంతులకు గురయ్యారు. క్రేన్​కూలిన ధాటికి భవనం శకలాలు ఆ పక్కనే ఉన్న కేర్ హాస్పిటల్ పై పడ్డాయి. 

అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళ సెక్యూరిటీ గార్డు గీతాసింగ్(40) చేతికి, తలకు గాయాలయ్యాయి. బ్లడ్ బ్యాంక్ బ్లాక్ ధ్వంసమైంది. గీత సింగ్ ను అదే హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. కూలిపోయిన క్రేన్ ను మరో క్రేన్ సహాయంతో శనివారం తొలిగించారు. అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఘటనా స్థలానికి ఆనుకుని పురాతన ఆలయం, ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నాయి. అటు వైపు కూలి ఉంటే ప్రాణనష్టం ఎక్కువ ఉండేదని స్థానికులు చెప్పారు.