ముంబై: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సంక్షేమ పథకాలు వ్యవసాయానికి అధిక కేటాయింపుల ద్వారా వినియోగానికి మద్దతు ఇవ్వడంపై ఈసారి కేంద్ర బడ్జెట్ దృష్టి పెడుతుందని రేటింగ్ఏజెన్సీ కేర్‌ఎడ్జ్ రేటింగ్ పేర్కొంది. ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్‌లోని క్యాపెక్స్ లక్ష్యాన్ని నిలుపుకునే అవకాశం ఉన్నందున, క్యాపెక్స్‌పై దృష్టి కొనసాగుతుందని తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం...ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 11.1 లక్షల కోట్ల క్యాపెక్స్ లక్ష్యాన్ని ప్రభుత్వం నిలుపుకోవాలని అంచనా వేస్తోంది.
గత ఆర్థిక సంవత్సరం మొత్తం పబ్లిక్ క్యాపెక్స్ 15.1శాతం పెరిగింది. రూ. 50 వేల కోట్ల వివిధ మూలధన రశీదుల (డివెస్ట్‌మెంట్‌తో సహా) లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉండవచ్చు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం భారీగా పెట్టుబడులను ఉపసంహరించవచ్చు. పెద్ద సంస్థలను ప్రైవేటీకరించవచ్చు. 2025 ఆర్థిక సంవత్సరంలో స్థూల పన్ను రాబడి 11శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు కేర్‌ఎడ్జ్ తెలిపింది.