టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లిని బెదిరించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించి ఆమె నుండి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకొంది. యువరాజ్ సింగ్ తల్లి షబ్నం సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, గత కొన్నేళ్లుగా యువరాజ్ సింగ్ సోదరుడు జోరావర్ సింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో 2022లో హేమా కౌశిక్ అనే మహిళను జోరవీర్‌కు సహాయకురాలిగా నియమించింది షబ్నం . కానీ, ఆమె తీరు ఇబ్బందికరంగా ఉండటంతో ఉద్యోగంలో నియమించుకొన్న 20 రోజుల్లోనే తొలగించారు. దీంతో ఈ ఏడాది మే నెల నుంచి ఆమె వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా యువీ తల్లిని బెదిరించడం మొదలుపెట్టింది. రూ. 40 లక్షలు ఇవ్వకపోతే వారి కుటుంబం పరువు తీస్తానని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని హెచ్చరిస్తూ వచ్చింది.
ఈ బెదిరింపులపై యువీ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పక్క ప్లాన్ ప్రకారం ఆమెను ఆరెస్ట్ చేశారు. రూ.5 లక్షలు ఆమెకు ఇచ్చేట్లు అంగీకరించినట్లు చెప్పి వలవేశారు. అనంతరం ఆమెను ఓ మాల్‌కు రప్పించి అరెస్టు చేశారు. నిందితురాలును ప్రశ్నిస్తున్నామని డీసీపీ (ఈస్ట్) నితీష్ అగర్వాల్ తెలిపారు.