కళ్లలో బాత్రూమ్ క్లీనర్ వేసిన కేర్‌టేకర్

కళ్లలో బాత్రూమ్ క్లీనర్ వేసిన కేర్‌టేకర్
  • బంగారం, డబ్బు ఆశతో 
  • వృద్ధురాలి కండ్లు పోగొట్టిన కేర్​టేకర్​
  • నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు 
  • బంగారు నగలు, రూ.40 వేలు స్వాధీనం

ఉప్పల్, వెలుగు: బంగారం, డబ్బు కొట్టేసేందుకు వృద్ధురాలి కండ్లు పోగొట్టిన కేర్​టేకర్​ను  నాచారం పోలీసులు అరెస్ట్​ చేశారు. స్నేహపురి కాలనీలోని  శ్రీనిధి అపార్ట్​మెంట్​లో ఉండే  సిరికొండ హేమలత (73) కొడుకు శశిధర్ లండన్​లో ఉంటున్నాడు. ఆమెకు కేర్​టేకర్​గా మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన పెరికె భార్గవి (32) గత ఆగస్టు నుంచి పని చేస్తూ అక్కడే తన ఏడేండ్ల కూతురితో కలిసి ఉంటోంది. హేమలత ఇంట్లో బంగారం , డబ్బును చూసిన భార్గవి కొట్టేయాలని స్కెచ్ వేసింది. హేమలతకు తరుచూ కండ్లలో నీరు వస్తూ ఇబ్బందులు పడేది. ఇదే అవకాశంగా చేసుకున్న భార్గవి గతేడాది అక్టోబర్​ చివరి వారం నుంచి వరుసగా 4 రోజుల పాటు  బాత్రూమ్​ క్లీనర్, జండూబామ్​ను నీటిలో కలిపి దాన్ని ఐ డ్రాప్స్​ అని నమ్మించి హేమలత కండ్లలో వేసింది.

దీంతో ఆమె  రెండు కండ్లు పోయాయి. హేమలతకు కండ్లకు ఇన్ ఫెక్షన్ సోకిందని.. కనిపించట్లేదని చెప్తోందని  లండన్​లో ఉన్న ఆమె కొడుకు శశిధర్​కు కాల్ చేసి భార్గవి చెప్పింది. ఆ తర్వాత బీరువాలోని బంగారం, డబ్బు తీసుకుంది.  ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది.  గత నెల 14న శశిధర్ లండన్ నుంచి సిటీకి వచ్చి హేమలతను  ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్​లో చేర్పించాడు. ఆమె కండ్లకు విషప్రయోగం జరిగిందని డాక్టర్లు చెప్పారు.  శశిధర్ వెంటనే భార్గవి రూమ్​లో చెక్ చేయగా బ్యాగ్​లో ఆరున్నర తులాల బంగారు నగలు కనిపించాయి. దీంతో పోలీసులకు కంప్లయింట్​ చేయగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. తానే  ఈ పని చేసినట్లు భార్గవి ఒప్పుకుంది. బంగారు నగలు, రూ.40 వేల క్యాష్​ను స్వాధీనం చేసుకుని కేసు ఫైల్  చేశారు. నిందితురాలిని రిమాండ్​కి తరలించినట్లు  నాచారం ఇన్​స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.