పులుల కోసం కారిడార్!

పులుల కోసం కారిడార్!
  • కవ్వాల్​ అభయారణ్యంలో టైగర్లు ఆవాసం ఏర్పాటు చేసుకునేలా అటవీశాఖ చర్యలు
  • కోర్ ఏరియాలోని గ్రామాల తరలింపుపై కసరత్తు
  • ఇప్పటికే 2 ఊర్లు ఖాళీ..మరో 3 ఊర్లు ఖాళీ చేయించడంపై ఫోకస్  
  • తాడోబా, తిప్పేశ్వరం,కడంబా టైగర్ జోన్ల నుంచి పులుల రాకపోకలు 

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర అడవుల్లో నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలోకి వచ్చి వెళ్తున్న పులులు ఇక్కడే శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయేలా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కవ్వాల్​ నుంచి తాడోబా టైగర్​జోన్​వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కవ్వాల్–తాడోబా అడవుల మధ్య కంటిన్యూటీ లేకపోవడం, ఈ రెండింటి మధ్యలో పంట పొలాలు, గ్రామాలు ఉండటంతో పులుల ఆవాసానికి ఆటంకంగా మారుతున్నట్లు గుర్తించారు.

ఇప్పటికే కాగజ్ నగర్​టైగర్ కారిడార్ ఏర్పాటు చేసిన్పటికీ పులులు అక్కడికి పెద్దగా రావడంలేదు. కవ్వాల్​టైగర్ జోన్ పరిధిలోని కొన్ని ఏరియాల్లోకి మాత్రం పులులు అడపా దడపా వచ్చిపోతున్నా.. ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. ఒకటి రెండు రోజులు సంచరించి తిరిగి వెళ్లిపోతున్నాయి. అందుకే పులులు ఇక్కడే శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయేలా  అటవీశాఖ అధికారులు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అడవిలో సాధారణంగా ఎలాంటి అలజడి, జన సంచారం లేని ప్రాంతాల్లోనే పులులు ఆవాసం ఏర్పర్చుకుంటాయి. దట్టమైన పచ్చిక బయళ్లు, వెదురు నిల్వలు కూడా ఉండాలి. అలాగే సంచారానికి అనుకూలంగా ఉండటంతో పాటు సమృద్ధిగా ఆహారం లభించే ప్రాంతాల్లోనే పులులు ఆవాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తాయని అధికారులు చెబుతున్నారు. 

మరో 3 గ్రామాల ఖాళీకి కసరత్తు 

కవ్వాల్ టైగర్ జోన్​లో పులులు ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కోర్​ ఏరియాలోని గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కవ్వాల్​లో కోర్ ఏరియా 892.23 చదరపు కిలోమీటర్లు, బఫర్ ఏరియా 1,123.21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. కోర్ ఏరియాలో 42 గ్రామాలు ఉండగా..  ఆ గ్రామాలన్నీ ఖాళీ చేయించాలని భావిస్తున్నారు. ఈ విషయంపై అక్కడి ప్రజలకు అధికారులు అవగాహన కల్పించి, పునరావాసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఇప్పటికే రాంపూర్, మైసంపేట గ్రామాలను ఖాళీ చేయించి నిర్మల్ జిల్లాలోని కడెం సమీపంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి తరలించారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. అక్కడికి కాకుండా తాము ఇష్టపడిన వేరే చోటికి వెళ్తే గనక.. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేశారు.

ప్రస్తుతం మల్యాల్, అల్లీనగర్, దుంగపల్లి గ్రామాలను కూడా ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వీరిని మంచిర్యాల జిల్లాలోని ముల్కలకు తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు గ్రామాల ప్రజలను గత సెప్టెంబర్ లో ముల్కల గ్రామానికి వెళ్లి చూపించారు. గ్రామంలో వారికి కల్పించే సౌకర్యాలను వివరించి, వారి  సందేహాలను నివృత్తి చేశారు. ఖాళీ చేసేందుకు గ్రామస్తులు ఒప్పుకోవడంతో వారిని ముల్కలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

నాలుగు పులుల సంచారం..   

కవ్వాల్ అభ్యయారణ్యం మంచిర్యాల, జన్నారం, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్​నగర్, ఖానాపురం, ఉట్నూరు, తదితర ప్రాంతాల వరకు మొత్తం 1.21 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్​టైగర్​ కారిడార్ ఏర్పాటు చేసినా..  అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. టైగర్స్​ఉండేలా అనువైన వసతులు కల్పించలేదు. కాగజ్​నగర్​టైగర్​జోన్​కు 130 కిలో మీటర్ల దూరంలో తాడోబా, 230 కిలో మీటర్ల దూరంలో తిప్పేశ్వర్, కడంబా​టైగర్​జోన్లు ఉంటాయి.

పులులకు ఆహారం దొరకపోవడం, ఆవాసానికి సరైన వాతావరణం లేకపోవడం, పులుల సంఖ్య పెరిగిపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వస్తుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. సిరొంచ, గడ్చిరోలి, యావత్మాల్ తదితర ప్రాంతాల నుంచి కూడా పులులు వస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పులులు సంచరిస్తున్నాయి. అవి తాడోబా, కడంబా, తిప్పేశ్వరం టైగర్ రిజర్వ్​ఫారెస్ట్​నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.

నిర్మల్– ఆదిలాబాద్ మధ్య అటవీ ప్రాంతంలో రెండు, సిర్పూర్​కాగజ్​నగర్ సమీపంలో మరో రెండు పులులు తిరుగుతున్నాయి. అయితే పులులు ఆవాసం ఏర్పాటు చేసుకోవాలంటే  60 నుంచి 100 చదరపు మీటర్ల పరిధిలో వాటికి ఎలాంటి డిస్ట్రబెన్స్​ఉండకూడదని, చుట్టూ గ్రాస్​ల్యాండ్ ఉండటంతోపాటు ఆహారం బాగా దొరికే ప్రదేశాల్లోనే అవి నివసిస్తాయని చెప్తున్నారు.  

తిప్పేశ్వర్​లో అధ్యయనం    

ఇటీవల మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రంలో మంచిర్యాల అటవీశాఖ అధికారులు పర్యటించారు. అక్కడి నుంచి తరలించిన పలు గ్రామాల గిరిజనులకు కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అధ్యయనం చేశారు. తిప్పేశ్వర్​ అభ్యయారణ్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు.

అలాగే కవ్వాల్​పులుల సంరక్షణ కేంద్రం, తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రానికి తేడాను గమనించారు. పులుల సంరక్షణకు తిప్పేశ్వర్​లో తీసుకుంటున్న చర్యలు, కవ్వాల్ లో చేపట్టాల్సిన పనులపై అటవీ శాఖ అధికారులు నోట్ సిద్ధం చేసి, దాని ప్రకారం ముందుకెళ్తున్నట్టు తెలిసింది.