- వరల్డ్ నం.1 ర్యాంక్ కైవసం
- 19 ఏండ్లకే టాప్ ర్యాంక్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు
- ఫైనల్లో రూడ్‌కు చుక్కెదురు
న్యూయార్క్: ‘నువ్వు టెన్నిస్ మ్యాచ్‌లు గెలవాలంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడివి అవ్వాలంటే.. నీ ఆలోచనల్లో, గుండెల్లో ఆటే ఉండాలి. ధైర్యంగా పోరాడాలి’ ఓ తాత తన మనవడికి ఇచ్చిన సలహా ఇది. తాత చెప్పినట్టే చేసిన ఆ కుర్రాడు 19 ఏండ్లకే గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకున్నాడు. అంతేనా వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ కూడా అందుకున్నాడు. అతనే స్పెయిన్ టీనేజ్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా. ఏడాదిగా సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న అల్కరాజ్.. వయసులో, అనుభవంలో తనకంటే పెద్దోడైన 23 ఏండ్ల నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ పని పట్టి యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. దాంతో, ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మూడు నుంచి టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లాడు. మెన్స్ సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో మూడో సీడ్ అల్కరాజ్ 6–-4, 2–-6, 7-–6 (7/1), 6–-3తో ఐదో సీడ్ రూడ్‌ను ఓడించాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్, టాప్ ర్యాంక్‌తో పాటు అల్కరాజ్ రూ. 20. 64 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. పోటీ పడ్డ తొలి ఫైనల్లోనే అతను గ్రాండ్‌స్లామ్ నెగ్గగా.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌తో పాటు న్యూయార్క్‌లోనూ రూడ్‌కు చుక్కెదురైంది. ఈ మ్యాచ్‌లో కార్లోస్ 3 డబుల్ ఫాల్ట్స్, 41 తప్పిదాలు చేసినా.. 14 ఏస్‌లు, 55 విన్నర్లు కొట్టాడు. 2 డబుల్ ఫాల్ట్స్, 29 తప్పిదాలు చేసిన రూడ్ 4 ఏస్‌లు, 37 విన్నర్లకే పరిమితం అయ్యాడు.
కుర్రాడిదే పైచేయి
వరల్డ్ నంబర్ వన్‌ను తేల్చే మ్యాచ్ కావడం, ఈ ఏడాది గొప్పగా ఆడుతున్న ఇద్దరు యంగ్‌స్టర్స్ బరిలో ఉండటంతో ఈ ఫైనల్ సర్వత్రా ఉత్కంఠ రేపింది. కార్లోస్ తన వయసుకు మించిన పరిణతితో అద్భుత పెర్ఫామెన్స్ చేశాడు. మూడు గంటల 20 నిమిషాల ఫైనల్ ఫైట్‌లో కోర్టులో చిరుతలా కదిలిన అతను.. తన భుజ బలం, బుద్ధిబలం చూపెట్టాడు. బేస్‌లైన్‌తో పాటు ఫ్రంట్ కోర్టులోనూ ఆధిపత్యం చెలాయించాడు. సర్వీస్ విన్నర్లు, ఏస్‌లతో హడలెత్తించాడు. బ్యాక్‌హ్యాండ్ విన్నర్లు, ఏస్‌లతో తొలి సెట్ నెగ్గిన అల్కరాజ్ రెండో సెట్ కోల్పోయాడు. మూడో సెట్ హోరాహోరీగా సాగింది. రెండో గేమ్‌లో స్పెయిన్ యంగ్ స్టర్ బ్రేక్ పాయింట్ సాధించినా.. రూడ్ గట్టి పోటీనిచ్చి ముందుకెళ్లాడు.
పన్నెండో గేమ్‌లో రెండు సెట్ పాయింట్లపై నిలిచాడు. కానీ, అద్భుతమైన డ్రాప్, ఓవర్ హెడ్ షాట్లతో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన అల్కరాజ్ సెట్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రూడ్ మిస్టేక్స్‌ను సద్వినియోగం చేసుకొని సెట్ నెగ్గి ఓవరాల్‌గా 2–1తో ఆధిక్యం సాధించాడు. నాలుగో సెట్‌లో గేరు మార్చిన స్పెయిన్ చిన్నోడు ఐదో గేమ్‌లో రూడ్ సర్వీస్ బ్రేక్ చేయడంతో పాటు ఏడో గేమ్‌లో రెండు ఏస్‌లు, రెండు ఫోర్ హ్యాండ్ విన్నర్లతో మరో బ్రేక్ పాయింట్ రాబట్టాడు. ఈ టైమ్‌లో వరుసగా నాలుగు పాయింట్లతో రూడ్ తర్వాతి గేమ్ నెగ్గి 3–5తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, తన సర్వీస్‌లో ఓ ఏస్, సర్వీస్ విన్నర్‌తో మ్యాచ్ పాయింట్ సాధించిన అల్కరాజ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాడు.