Wimbledon 2024: వింబుల్డన్ విజేత అల్కరాజ్.. రూ.28 కోట్ల ప్రైజ్ మనీ సొంతం

వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ విజేతగా స్పానిష్  టెన్నిస్ ప్లేయర్  కార్లోస్ అల్కరాజ్ అవతరించాడు. ఆదివారం(జులై 14) జ‌రిగిన సింగిల్స్ ఫైన‌ల్లో నొవాక్ జ‌కోవిచ్‌‌ను 6-2, 6-2, 7-6తో వరుస సెట్లలో ఓడించి ట్రోఫీని ముద్దాడాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్ ట్రోఫీతో పాటు 2,700,000 స్టెర్లింగ్ పౌండ్ (భారత కరెన్సీలో దాదాపు రూ.28 కోట్లు) సొంతం చేసుకున్నాడు. స్పానిష్ స్టార్‌కు ఇది రెండవ వింబుల్డన్ టైటిల్‌ కాగా, నాలుగో గ్రాండ్ స్లామ్ ట్రోఫీ. 

సెమీఫైన‌ల్లో డానిల్ మెద్వెదేవ్‌ ను మ‌ట్టి క‌రిపించిన స్పెయిన్ స్టార్ ఫైనల్లోనూ అదే దూకుడు కనపరిచాడు. తొలి రెండు సెట్లను సునాయాసంగా గెలిచాడు. అయితే, మూడో సెట్‌లో అతనికి జకోవిచ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మూడో సెట్‌ 6-6తో సమం కావడంతో మ్యాచ్‌ ట్రై బ్రేకర్‌కు దారి తీసింది. ఇందులో అల్కరాజ్ 7-4తో జకోవిచ్‌ను మట్టి కురిపించాడు. కాగా, వింబుల్డ‌న్ 2023 ఫైన‌ల్లోనూ జ‌కోవిచ్.. అల్క‌రాజ్ చేతిలోనే ఓట‌మి పాలయ్యాడు.