- రూడ్ X అల్కరాజ్
- సెమీస్‌లో కచనోవ్, టియఫోపై గెలుపు
- ఫైనల్ రాత్రి 1.30 నుంచి సోనీ నెట్ వర్క్‌లో
న్యూయార్క్: కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ కోసం నార్వే యంగ్‌స్టర్ కాస్పర్ రూడ్, స్పెయిన్ టీనేజ్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్ అమీతుమీకి రెడీ అయ్యారు. యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్స్, స్టార్లను మట్టికరిపిస్తూ ముందుకొచ్చిన ఈ ఇద్దరూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఆదివారం రాత్రి టైటిల్ కోసం పోటీ పడనున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో ఐదోసీడ్ రూడ్ 7–6 (7/5), 6–2, 5–7, 6–2తో 27వ సీడ్ కారెన్ కచనోవ్ (రష్యా)పై గెలిచాడు. ఫలితంగా ఈ ఏడాది రెండోసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించాడు. జూన్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో నడాల్ చేతిలో ఓడిన రుడ్.. ఒకవేళ యూఎస్ ఓపెన్ గెలిస్తే ఏడో ర్యాంక్ నుంచి నంబర్ వన్‌కు దూసుకొస్తాడు. ఈసారి సెమీస్‌కు చేరుకున్న నలుగురికి యూఎస్ ఓపెన్‌లో ఆడటం ఇదే మొదటిసారి. యూఎస్ ఓపెన్ మొదలైన 1881లో ఇలాంటి సీన్ కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రిపీట్ అయ్యింది. 3 గంటల పోరాటంలో రూట్ అద్భుతంగా పోరాడాడు.
ఒక్క పాయింట్ కోసం 55 షాట్స్ ఆడిన అతను.. బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లలో ఆకట్టుకున్నాడు. తొలి సెట్‌లో రూడ్, కచనోవ్ ఇద్దరూ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టై బ్రేక్‌కు దారితీసింది. ఇందులో రూడ్ కొట్టిన షోల్డర్ వ్యాలీకి కచనోవ్ జవాబు ఇవ్వకపోవడంతో 6–3 లీడ్‌లోకి వెళ్లాడు. తర్వాతి పాయింట్ కోసం 19 స్ట్రోక్స్ ఆడి రూడ్ పైచేయి సాధించాడు. రెండో సెట్ మూడో గేమ్‌లో కచనోవ్ సర్వ్ బ్రేక్ చేసి రుడ్ 2–1 ఆధిక్యంలోకి వెళ్లి వెనుతిరిగి చూసుకోలేదు. అయితే మూడోసెట్‌లో సర్వీస్‌ల్లో ఇబ్బందిపడ్డ రూడ్‌కు.. కచనోవ్ వ్యాలీలతో అడ్డుకట్ట వేశాడు. కీలకమైన నాలుగో గేమ్‌లో రిథమ్‌లోకి వచ్చిన రూడ్.. మళ్లీ మూడో గేమ్‌లో సర్వీస్‌ను బ్రేక్ చేసి ముందంజ వేశాడు. తర్వాతి గేమ్‌ల్లో కాస్పర్ సర్వ్‌ను బ్రేక్ చేసే చాన్స్ వచ్చినా కచనోవ్ సద్వినియోగం చేసుకోలేక ఓటమిపాలయ్యాడు.
టియఫోకు కార్లోస్ చెక్
మరో సెమీస్‌లో మూడోసీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–7 (6/8), 6–3, 6–1, 6–7 (5/7), 6–3తో ఫ్రాన్సెస్ టియఫో (అమెరికా)పై గెలిచి టైటిల్ పోరులోకి ప్రవేశించాడు. 4 గంటల 19 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో టియఫో.. అల్కరాజ్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. కాకపోతే కీలక సమయంలో పాయింట్లు సాధించడంలో విఫలమయ్యాడు. మ్యాచ్ మొత్తంలో అల్కరాజ్ 6 ఏస్‌లు, 3 డబుల్‌ఫాల్ట్స్ చేశాడు. 15 ఏస్‌లు కొట్టిన టియఫో 6 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. 20 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో అల్కరాజ్ తొమ్మిది కాపాడుకున్నాడు. టియఫో ఏడింటిలో మూడు మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. అయితే 52 అనవసర తప్పిదాలు చేసిన టియఫో నిరాశ పరిచాడు.