MAX60 League: విండీస్ ఆటగాడు బలుపు పనులు.. ఔటయ్యాక ఏం చేసాడో తెలుసా..?

మాక్స్ 60 కరేబియన్ 2024 లీగ్ లో వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్ హద్దుమీరి ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారుతుంది. న్యూయార్క్ స్ట్రైకర్స్, గ్రాండ్ కేమాన్ జాగ్వార్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  బ్రాత్‌వైట్ తన కోపాన్ని నియంత్రించుకోలేక విమర్శల పాలవుతున్నాడు. న్యూయార్క్ స్ట్రైకర్స్‌ తరపున ఆడుతున్న ఈ విండీస్ పవర్ హిట్టర్ ఇన్నింగ్స్ 9 ఓవర్లో జోషువా లిటిల్ బౌలింగ్ లో  వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఔటైన తర్వాత పెవిలియన్ బాట పట్టిన అతను తన చేతిలో ఉన్న హెల్మెట్ ను బ్యాట్ తో గట్టిగా కొట్టాడు. 

బ్రాత్‌వైట్ బలంగా కొట్టడంతో హెల్మెట్ చాలా దూరంలో వెళ్లి పడింది. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతని కోపానికి కారణం అంపైర్ ఔటివ్వడమే అని తెలుస్తుంది. లిటిల్ వేసిన బంతి అతని బ్యాట్ కు కాకుండా భుజాలకు తాకుతూ వికెట్ కీపర్ చేతిలో పడింది. దీంతో అతను 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంపైర్ ఔట్ పై అసహనం వ్యక్తం చేసిన అతను డగౌట్ లో తన కోపాన్ని ప్రదర్శించాడు.

ఈ మ్యాచ్ లో బ్రాత్‌వైట్ టీం న్యూయార్క్ స్ట్రైకర్స్‌ 8 పరుగుల తేడాతో ఘానా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ స్ట్రైకర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గ్రాండ్ కేమాన్ జాగ్వార్స్ 5 వికెట్లకు 95 పరుగులకు పరిమితమైంది. ఇక ఈ టోర్నీ విషయానికి వస్తే ఆదివారం (ఆగస్టు 25) జరిగిన ఫైనల్లో కరీబియన్ టైగెర్స్ 56 పరుగుల తేడాతో   న్యూయార్క్ స్ట్రైకర్స్‌ పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.