
కోల్‌కతా: వరల్డ్ నంబర్‌వన్ చెస్ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే).. టాటా స్టీల్ చెస్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్ టైటిల్‌ను సాధించాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే 13 పాయింట్లతో విన్నర్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన మూడు రౌండ్లలో కార్ల్‌సన్ వరుసగా డుబోవ్, అర్జున్ ఎరిగైసి, విదిత్ గుజరాతీపై గెలిచాడు. దీంతో 2019లో ఇక్కడ గెలిచిన ట్రోఫీని మరోసారి అందుకున్నాడు. చివరి ఆరు రౌండ్లలో వరుసగా విజయాలు సాధించిన వెస్లీ సో (అమెరికా) 11.5 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచాడు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ (10.5), ఆర్. ప్రజ్ఞానంద (9.5), విదిత్ (9) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. విమెన్స్ సెక్షన్‌లో మూడుసార్లు వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ కెటరైనా లాగ్నో (రష్యా) 11.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. వాలెంటినా గునినా (11) రెండో ప్లేస్‌ను సాధించింది. అలెగ్జాండ్రా గొరియాచికినా, వంతికా చెరో 9.5 పాయింట్లతో మూడో ప్లేస్‌ను పంచుకున్నారు. హంపి (9), హారిక (8.5) ఆరు, ఏడు ప్లేస్‌ల్లో ఉన్నారు.