MLC 2024: రక్తంతో మైదానంలోనే కుప్పకూలిన యువ బౌలర్

మేజర్ లీగ్ క్రికెట్ లో మంగళవారం (జూలై 16) సీటెల్ ఓర్కాస్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మోరిస్‌విల్లేలో చర్చ్ స్ట్రీట్ పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో  శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తరపున ఆడుతున్న లే రౌక్స్ ముఖానికి తీవ్ర గాయమైంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతిని ఆఫ్ సైడ్ విసిరాడు. సీటెల్ ఓర్కాస్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ బంతిని బలంగా బాదాడు.

లంగాఫ్ దిశగా ఆడిన బలంగా షాట్ ఆడగా.. ఆ బంతి నేరుగా బౌలర్ తల కింద భాగంలో తగిలింది. దీంతో వెంటనే లే రౌక్స్ గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. రెప్పపాటులో బంతి బలంగా తగలడంతో రక్తం కారి అక్కడికక్కడే పడిపోయాడు. ఈ సంఘటన గ్రౌండ్ లో అందరిని  కాసేపు టెన్షన్‌కు గురి చేసింది. ఫిజియో వచ్చి మైదానం నుంచి ఈ అమెరికా బౌలర్ ను తీసుకెళ్లాడు. అదృష్టవశాత్తూ లె రౌక్స్ గాయంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని సమాచారం. అతని గాయం తీవ్రమైంది కాదని.. త్వరలోనే కోలుకుంటాడని వైద్యలు చెప్పారు. 

లె రౌక్స్ దక్షిణాఫ్రికాలో జన్మించాడు. అయితే కొన్ని కారణాల వలన అమెరికా వెళ్లిన అతను అక్కడ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఈ మ్యాచ్ లో 10 బంతులేసిన రూక్స్ 11 పరుగులు ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 23 పరుగుల తేడాతో సీటెల్ ఓర్కాస్ పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సీటెల్ ఓర్కాస్ 142 పరుగులకు పరిమితమైంది.