‘‘కరోనా పరీక్షలొద్దు. నేను బతుకు తెరువు చూసుకోవాలి. సాంస్కృతిక విప్లవం కాదు, నాకు సంస్కరణలు కావాలి. లాక్ డౌన్లకు తెరదించండి. నన్ను స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోనివ్వండి. నాయకులను నామీద రుద్దకండి. నేను ఓటు వేయాలనుకుంటున్నాను. అసత్యాలెందుకు, నన్ను దర్జాగా ఉండనివ్వండి. నేను బానిసగా బతకాలనుకోవడం లేదు. నేను ఒక పౌరుడుగా ఉంటాను” అని రాసి ఉన్న ప్లకార్డును ఒక యువకుడు మొన్నామధ్య బీజింగ్ లో ఒక వంతెన పక్కన నుంచొని ప్రదర్శించాడు. మరొక నిరసనకారుడు ఏకంగా దేశ పౌరులు సమ్మెకు దిగాలని, ద్రోహి, నియంత అయిన సీ జిన్ పింగ్ ను పదవి నుంచి తొలగించాలంటూ పిలుపునిచ్చాడు. తర్వాత కొద్ది రోజులకే కమ్యూనిస్టు మహా సభల్లో జిన్ పింగ్ అపమార్గాలు తొక్కి అయినా తన పదవిని సుస్థిరపరచుకుని మూడో విడత అధికారాన్ని పొంది చరిత్ర సృష్టించడం వేరే విషయం. మొత్తానికి, ఆ ఇద్దరు నిరసనకారులు ఈ ఏడాది అక్టోబరులో తెలిపిన ఆ నిరసన చైనా ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను వ్యక్తపరిచింది. ఇపుడక్కడ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో చోటు చేసుకుంటున్న సామూహిక నిరసన ప్రదర్శనలే అందుకు నిదర్శనం.
4 నెలలుగా జనం ఇండ్లకే పరిమితం
క్వారంటైన్, ఇతర నిబంధనలను మార్చడం ద్వారా జన జీవనం సాఫీగా సాగేటట్లు చూస్తామని పాలక పార్టీ అక్టోబర్ లో వాగ్దానం చేసింది. కానీ, కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నగరాలు నిబంధనలను కట్టుదిట్టం చేయడంతో ప్రజానీకంలో సహనం నశించిపోతున్నది. అమెరికాలో కన్నా, ప్రపంచంలోని ఇతర ప్రధాన దేశాల్లో కన్నా తమ దేశంలో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉందని ప్రకటించుకోవాలని చైనా ఆరాటం. దాంతో కరోనా రహిత దేశంగా మారడమంటూ ఒక లక్ష్యాన్ని ప్రకటించేసింది. కొవిడ్ సోకిన ప్రతి ఒక్కరినీ అధికారులు ఏకాకులను చేస్తున్నారు. కోట్లాది మంది గత నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమైపోయారు. అలాగని, ఆహారం, మందులు సరఫరా చేసే ఏర్పాటు ఏదీ చేయలేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. కరోనా బయటపడ్డ మొదట్లో కూడా చైనా ప్రభుత్వం అమానుష విధానాలనే అనుసరించింది. నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇంతవరకు ఎంతమందిని నిర్బంధంలోకి తీసుకున్నారో లెక్కలు లేవు. నిరంకుశ పాలన కావడం వల్ల సమాచారాన్ని బయటకు పొక్కనివ్వరు. కానీ, ఆధునిక సమాచార విప్లవం కారణంగా ఏదో ఒక మార్గంలో సమాచారం బయటకు పొక్కుతూనే ఉంది. ఇతర దేశాలకు ఉద్యోగాల నిమిత్తం వలసవెళ్లినవారు, చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు నిరసనకారుల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికాలలోని కనీసం డజను నగరాల్లో శాంతియుత నిరసన ప్రదర్శనను నిర్వహించారు.
జీరో కరోనా పాలసీ..
స్థిరాస్తుల రంగం దెబ్బతినడంతో నిర్మాణాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వాటిని చేపట్టిన కంపెనీలు ఆస్తులను అప్పగించకపోవడంతో గృహాలు, షాపులు కొనుగోలు చేసినవారు బ్యాంకులకు నెలవారీ వాయిదాలు కట్టడం ఆపేశారు. బ్యాంకులు డిపాజిటర్లకు వడ్డీలు, అసలు మొత్తాలు చెల్లించడం మానేశాయి. హెనన్ పరగణాలోని చాలా బ్యాంకులది ఇదే పరిస్థితి. అదొక సంక్షోభం. తమ పొదుపు మొత్తాల గురించి వాకబు చేసేందుకు వందలాది మంది డిపాజిటర్లు ఈ ఏడాది జూన్–జులైల మధ్యలో చెన్ చో ప్రాంతానికి బయలుదేరారు. వారి స్మార్ట్ ఫోన్లలోని యాప్ వారిని కొవిడ్ సోకిన వారుగా ‘ఎర్ర’ గా చూపిస్తోందంటూ ఆయా బ్యాంకులున్న ప్రాంతాలకు వెళ్లనివ్వలేదు. అటువంటి వారి అవస్థలు వర్ణనాతీతం. జనాభా వయసు వర్గాలను పరిశీలిస్తే చైనాలో ముదుసలుల సంఖ్య పెరుగుతోంది. తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేసినా వాటిలో పడకల సంఖ్య పరిమితం. చైనాలో తయారైన వ్యాక్సిన్లు ఫలితమివ్వడం లేదంటున్నారు. స్థానిక పాలనా సంస్థల అత్యుత్సాహం జనాలను బెంబేలెత్తిస్తున్నది. చెన్ చో పరగణాలోని ఒక మొబైల్ ఫోన్ల తయారీ ఫ్యాక్టరీలో కొద్ది మందికి కరోనా ఉన్నట్లు కనుక్కున్నారు. కానీ, సిబ్బంది ఎవరూ ఫ్యాక్టరీ గేటు దాటి బయటకు రావడానికి వీలులేదని ఆదేశించడంతో కార్మికులు కొందరు గోడలు ఎక్కి బయటకు దూకారు. అది అసలు కరోనా ప్రయోగ శిబిరమని, వారిపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయో లేదో(ఎంతమంది చనిపోతారు, ఎంతమంది బతుకుతారు) తెలుసుకోవాలనుకుంటున్నారని వదంతులు వ్యాపించాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చైనా ప్రభుత్వం జీరో కరోనా పాలసీ నిబంధనలను సడలిస్తున్నట్లు ఆలస్యంగా ప్రకటించింది.
లాక్డౌన్లతో ఇబ్బందులు
కరోనా బారినపడుతున్నవారి సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల్లో తగ్గుముఖంపడితే, అది మొదలైనట్లు భావిస్తున్న చైనాలో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మన దేశంలో మాదిరిగా అందరికీ టీకాలు వేయకపోవడం, వేసినా అవి పనిచేయకపోవడం దానికి కారణం. చైనాలో నవంబర్ 28న కొత్తగా 40 వేల పైచిలుకు కరోనా కేసులు వెలుగుచూశాయి. వారిలో మూడొంతుల మందిలో లక్షణాలు కూడా పొడసూపలేదు. లాక్ డౌన్లు, మూకుమ్మడి పరీక్షలు, గృహ నిర్బంధాలతో విసిగిపోయిన ప్రజల నుంచి చెదురుమదురు నిరసన ప్రదర్శనలు 2022 మార్చిలోనే మొదలయ్యాయి. తాజాగా, రాజధాని బీజింగ్ సహా షాంఘై, వాంగ్ జిగ్ వాన్, గ్వాన్ జో, చెన్ గీ, యూరించి, నాన్ జిన్, టాన్ జింగ్, చెన్ చో నగరాల్లో దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఎరుగనంత మూకుమ్మడి నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. యూరించిలో ఒక అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం వీటికి ప్రేరణగా నిలిచింది. ఈ బహుళ అంతస్తుల భవనానికి బయట ఒకపక్క కార్లు మరోపక్క బయటివారు లోపలికి వెళ్లి ఇన్ ఫెక్షన్ బారిన పడకుండా కంచెలు, గేట్లు ఏర్పాటు చేశారు. దాంతో మంటలు ఆర్పే సిబ్బంది సకాలంలోనే అక్కడికి చేరుకున్నా ఈ అడ్డంకులు, ఇతర నిబంధనల కారణంగా లోపలికి వెళ్లలేకపోయారు. ఈ ఘటనలో పది మంది సజీవ దహనం కాగా, చాలా మంది గాయపడ్డారు. అపార్ట్ మెంట్లలోనివారు గగ్గోలు పెడుతున్నా వారి మొర ఆలకించినవారు లేరు. యూరించి అధికారులు ఆ తర్వాత క్షమాపణలు తెలిపి, ఆంక్షలను ఎత్తివేశారు. రాత్రికి రాత్రే కేసులు తగ్గిపోయాయా లేక ఇది మరో పెద్ద కుంభకోణమా అంటూ నెటిజన్లు దానిపై విరుచుకుపడుతున్నారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లాక్ డౌన్ల కారణంగా ఉపాధి లేక కోట్లాది మంది అల్లాడుతున్నారు. వారిలో ఆగ్రహం ఒక్కసారిగా పెల్లుబికింది. “పేదరికమే ఒక జబ్బు అనుకుంటే, స్వాతంత్ర్యం లేకపోవడం మరో జబ్బు. మాకు ఈ రెండూ పట్టుకున్నాయి. కాస్త జలుబుకే మేమిపుడు సతమతమవుతున్నాం” అని మరో పౌరుడు వాపోయిన ఘటన సమాచార సాధనాలకెక్కింది. పోలీసులు నిరసన ప్రదర్శనలను చెల్లాచెదురు చేసిన కొద్ది గంటలకే మళ్లీ జనం అక్కడికే వచ్చి నిరసనలు చేపడుతున్నారు.
మందగమనంలో ఆర్థికాభివృద్ధి
నిజానికి, జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తున్నది చైనా ఒక్కటే కాదు. వియత్నాం నుంచి న్యూజిలాండ్ వరకు చాలా దేశాలు ఈ మహమ్మారి ముప్పిరిగొన్నప్పుడే దాన్ని తుదముట్టించే కృషి కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. కానీ, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతూ, డెల్టా, ఒమిక్రాన్ వేవ్స్ కూడా మీదపడటంతో అవి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, కరోనాతో సహ జీవనం లాంటి మంత్రాలను అందుకున్నాయి. కానీ, షీ జిన్ పింగ్ దీన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడం, అంతర్జాతీయంగా బడాయికి పోవడం ఇపుడు ఆయనకే తలనొప్పిగా మారింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం రెండింటిపైనా పట్టు బిగించి జిన్ పింగ్ ఒక రకంగా నిరంకుశ పాలన సాగిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలపై పార్టీదే తుది పెత్తనమని, దేశ భద్రతకు ప్రాధాన్యమని పార్టీ 20వ మహా సభలు తీర్మానించుకున్నాయి. కొవిడ్ లాంటి మహమ్మారులు తలెత్తినపుడు మొత్తం అధికారాన్ని గుప్పిటనుంచుకున్న ప్రభుత్వాలు వాటిని సమర్థంగా ఎదుర్కోలేవని వెల్లడవుతుతున్నది. అవి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పద్ధతులను మార్చుకోలేవు.
చైనా ఆర్థికాభివృద్ధి మునుపటి అంచనాలకు తగ్గట్లుగా ఏమీ లేదు. అది ప్రస్తుతం మందగిస్తున్నది. ఇది చైనాకు మింగుడుపడటం లేదు. తైవాన్ స్వాతంత్ర్యాన్ని హరించడానికి, భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా తీసుకుంటున్న దుందుడుకు చర్యలు, రుణాలు ఇచ్చి శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలను లొంగదీసుకునేందుకు ప్రయత్నించడం వంటివి అంతర్జాతీయ సభ్య సమాజం దాన్ని ఏవగించుకునేటట్లు చేస్తున్నాయి. ఈ నిరసన ప్రదర్శనలతోనే జిన్ పింగ్ దిగిపోవాల్సిన పరిస్థితులు రాకపోవచ్చు. కానీ, ప్రజానీకంలో అసంతృప్తి ఇదే రీతిన పెరుగుతూపోతే మాత్రం, కమ్యూనిస్టు ప్రభుత్వం1989లో తియానన్మెన్ స్క్వేర్ లో మారణకాండకు పాల్పడినట్లే తిరిగి తన పౌరులను తానే చంపుకోవాల్సి రావచ్చు.
- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్