చావుబతుకుల్లో కార్వింగ్​ కళాకారుడు... దయనీయ స్థితిలో ఇద్దరు పిల్లలు

చావుబతుకుల్లో కార్వింగ్​ కళాకారుడు... దయనీయ స్థితిలో ఇద్దరు పిల్లలు
  • బ్రెయిన్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌తో హైదరాబాద్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌
  • ఏడాది కింద కిడ్నీ వ్యాధితో భార్య మృతి
  • దయనీయ స్థితిలో ఇద్దరు పిల్లలు
  • హాస్పిటల్‌‌‌‌ ఖర్చులకు తల్లడిల్లుతున్న వృద్ధ తల్లిదండ్రులు

మిర్యాలగూడ, వెలుగు : అతనో కార్వింగ్‌‌‌‌ కళాకారుడు. చెక్కపై దేవతామూర్తులు, ఇతర కళాఖండాలు చెక్కడంలో మేటి. కార్వింగ్‌‌‌‌ కళలో తనదైన ముద్ర వేసుకొని పలువురి ప్రశంసలు అందుకున్నాడు. కానీ సిస్టమిక్‌‌‌‌ ల్యూపస్‌‌‌‌ అర్థిమెటోసిస్ (ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ఈ) అనే అరుదైన వ్యాధి కారణంగా మూడు నెలల కింద బ్రెయిన్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ బారిన పడ్డాడు. ప్రస్తుతం అచేతన స్థితిలో హైదరాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ రిహాబిలిటేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఆయన భార్య సైతం కిడ్నీ వ్యాధితో ఏడాది కిందే చనిపోయింది. దీంతో వారి పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

మూడు నెలలుగా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బంగారు గడ్డకు చెందిన బైరోజు నర్సింహాచారి (35) కార్వింగ్‌‌‌‌ కళాకారుడు. చెక్కపై చేతితో అద్భుతమైన కళాఖండాలు చెక్కడం ద్వారా పలు రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం యంత్రాల రాకతో ఈ కళ అంతరించిపోతుండగా, యువకుడైనప్పటికీ కార్వింగ్‌‌‌‌ కళను కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన భార్య మల్లీశ్వరికి రెండు కిడ్నీలు ఫెయిల్‌‌‌‌ కావడంతో ఆమె ఏడాది కిందే చనిపోయింది. నర్సింహాచారి అప్పటికే సిస్టమిక్‌‌‌‌ ల్యూపస్‌‌‌‌ అర్థిమెటోసిస్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ఈ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది రోగ నిరోధక వ్యవస్థ సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్‌‌‌‌ డిసీజ్‌‌‌‌.

ఈ క్రమంలో మూడు నెలల కింద నర్సింహాచారి బ్రెయిన్‌‌‌‌  స్ట్రోక్‌‌‌‌కు గురయ్యాడు. నల్గొండలోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌‌‌‌లోని ఓ రిహాబిలిటేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌కు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయిస్తున్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి అచేతనంగా పడి ఉండడంతో వీరి ఇద్దరు పిల్లలు ధర్మేంద్ర (6), మన్వేంద్ర (12) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

వీరిద్దరూ ప్రస్తుతం నరసింహాచారి తల్లిదండ్రులైన వృద్ధ దంపతులు భైరోజు అంజయ్య, సాంబమ్మ సంరక్షణలో ఉన్నారు. తల్లిదండ్రులు తెలిసినకాడల్లా అప్పు చేసి ఇప్పటిదాకా రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలెవరైనా ముందుకు వచ్చి చికిత్స కోసం సాయం చేయాలని, పిల్లల భవిష్యత్‌‌‌‌కు అండగా నిలవాలని వేడుకుంటున్నారు. సాయం చేయడం కోసం 99850 32993 నంబర్‌‌‌‌ను సంప్రదించాలని కోరుతున్నారు.