ఫిట్​నెస్ లేని 34 బస్సులపై కేసు నమోదు

ఫిట్​నెస్ లేని 34 బస్సులపై కేసు నమోదు
  • మూడో రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధికారుల దాడులు  

హైదరాబాద్,​ వెలుగు : విద్యా సంస్థల బస్సులపై ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడో రోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం నాలుగు బృందాలుగా ఏర్పడి ఫిట్ నెస్ లేని, పన్నులు చెల్లించని 34 బస్సులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ఫిట్ నెస్ లేని, 15 ఏండ్లు దాటిన విద్యా సంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లోను రోడ్లపైన తిప్పరాదని చెప్పారు.

అనుభవమున్న, 60 ఏండ్లకు పైబడని వారిని డ్రైవర్లుగా నియమించుకోవాలని సూచించారు. ప్రతి విద్యాసంస్థకు చెందిన బస్సులు తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని పేర్కొన్నారు. ఈ దాడులలో రంగారెడ్డి, మేడ్చల్, ఉప్పల్ రవాణా శాఖ అధికారులు కిరణ్ రెడ్డి, కృష్ణవేణి, సునీత, నవీన్, ఉపాసిని, ప్రతాప్ రాజా, త్రివేణి, శ్రీనివాస్, అనూష తదితరులు పాల్గొన్నారు.