- దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో నాంపల్లి కోర్టు ఆదేశాలతో కేసు ఫైల్
- ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని పోలీసులకు ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఫ్యామిలీపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు వెంకటేశ్‌తో సహా సురేశ్ బాబు, రానా, అభిరామ్‌లపై ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత అంశం సిటీ సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ హోటల్‌ను దగ్గుబాటి కుటుంబం కూల్చివేసింది. దీంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని శనివారం కోర్టు ఆదేశించింది. కాగా, హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో దక్కన్ కిచెన్ ఉండేది. దీనిని నందకుమార్ నిర్వహిస్తుండగా.. కిచెన్ ఉన్న స్థలం దగ్గుబాటి ఫ్యామిలీకి చెందింది. దీని లీజు పూర్తయినా అక్కడ ఎలాంటి అనుమతుల్లేకుండా హోటల్‌ను రన్ చేస్తున్నారని దగ్గుబాటి ఫ్యామిలీ జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసింది. దీంతో బల్దియా అధికారులు 2022లో ఆ హోటల్‌ను పాక్షికంగా కూల్చివేశారు.
ఈ క్రమంలో ఆ హోటల్ నిర్వాహకుడు నందకుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసుపై స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఆర్డర్ అమల్లో ఉండగా హోటల్ కూల్చివేయడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు ప్రొడ్యూసర్ సురేశ్ బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్‌ను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నందకుమార్ మళ్లీ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిల్మ్‌నగర్ పోలీసులను శనివారం ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రానా, అభిరామ్‌లపై కోర్టు ఆదేశాల మేరకు సెక్షన్ 448, 452, 458, 120బి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘనల కింద వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.