- మూలవరుల ఫొటోలు తీసిన బీజేపీ అభ్యర్థి అనుచరుడు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం రామాలయంలో శనివారం అపచారం జరిగింది. బీజేపీ మహబూబ్బాద్ లోక్సభ క్యాండిడేట్ సీతారాంనాయక్అనుచరుడు శ్రీసీతారామచంద్రస్వామి, ఆంజనేయస్వామి మూలవరుల ఫొటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం ఉంది. ఆలయం కింద కౌంటర్‌లో వాటిని డిపాజిట్ చేశాకే ఆలయంలోకి రావాలి. చిత్రకూట మండపం, గాలిగోపురం, ఉత్తరద్వారం వద్ద మూడంచెల్లో సెక్యూరిటీ సిబ్బంది భక్తుల బ్యాగులు, జేబులు చెకింగ్ చేస్తారు.
అయినప్పటికీ అతను ఫోన్ తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నాయకులకు ప్రొటోకాల్ ఉండదు. తప్పనిసరిగా వారిని తనిఖీ చేయాల్సిందే. కానీ, సెక్యూరిటీ స్టాఫ్ వారిని ఎందుకు చెక్ చేయలేదు..? ఎలా అనుమతించారు..? అని భక్తులు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొట్టడంతో ఈవో ఎల్.రమాదేవి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె సీసీ ఫుటేజీని పరిశీలించి సీతారాంనాయక్ వెంట వచ్చిన ఆయన అనుచరుడు ఈ ఫొటోలు తీసినట్లుగా గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీతారాం నాయక్ పై కేసు నమోదు చేశారు భద్రాచల పట్టణ పోలీసులు