- వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుండు..
- తనను, పిల్లలను పట్టించుకోవడంలేదని కంప్లయింట్
నకిరేకల్, వెలుగు: వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోవడం లేదంటూ ఓ కానిస్టేబుల్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. బుధవారం బాధితురాలు నాగమణి మీడియాతో మాట్లాడుతూ.. కేతేపల్లి పీఎస్ లో కానిస్టేబుల్ అయిన తన భర్త మొగిలి సైదులు డిప్యూటేషన్ పై శాలిగౌరారం సర్కిల్ ఆఫీసులో సీఐ కారు డ్రైవర్ గా చేస్తున్నాడు. అతను కొంతకాలంగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నకిరేకల్ లో రూమ్ తీసుకుని ఉంటున్నాడని పేర్కొంది. అక్కడికి వెళ్లి నిలదీయగా తనపై భర్త సైదులు దాడి చేసి బంధించి హత్యాయత్నానికి పాల్పడ్డాడని నకిరేకల్ పోలీసుస్టేషన్ లో సీఐకి కంప్లయింట్ చేసినట్టు తెలిపింది.
తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తమ జీవితాలను ఆగం చేసిన భర్తపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా.. అదనపు కట్నం తేవాలని వేధించడంతోపాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను ప్రశ్నిస్తే తనపై దాడి చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని నకిరేకల్ ఎస్ఐ తెలిపారు. నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి బాధితురాలితో ఫోన్ లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.