జీపీ బిల్డింగ్ తాకట్టుకు ప్లాన్

జీపీ బిల్డింగ్ తాకట్టుకు ప్లాన్
  • మేడిపల్లి పీఎస్​లో సెక్రటరీ ఫిర్యాదు
  • మాజీ సర్పంచ్ భర్తపై కేసు నమోదు 

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామపంచాయతీ భ‌‌వ‌‌నాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేసిన మాజీ సర్పంచ్  భర్త, కాంట్రాక్టర్  మామిడి ధ‌‌ర్మారెడ్డిపై కేసు నమోదు చేశారు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్  353(2) సెక్షన్  కింద పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టారు. గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు తీసుకున్నప్పటికీ, పెండింగ్ లో ఉన్నాయని బ్యాంకు అధికారులను కాంట్రాక్టర్  సంప్రదించినట్లు కార్యదర్శి శ్యామల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

జిల్లాలోని ఇతర గ్రామాల మాజీ సర్పంచ్ లను ఇలాగే తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరించిన మామిడి ధర్మారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా ప్రభుత్వ ఆస్తి అయిన జీపీ బిల్డింగ్ ను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది.