
జనగామ, వెలుగు: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డిపై జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫిర్యాదుతో ఈనెల 1న తుల్జా భవానీతో పాటు ఆమె భర్త రాహుల్ రెడ్డిపై కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న తన బిడ్డ, అల్లుడు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, ఉద్దేశ పూర్వకంగా పర్యటనలను అడ్డుకోవాలని చూస్తున్నారని, వారి నుంచి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోర్టు ఎమ్మెల్యే పర్యటనలకు రక్షణ కల్పించాలని పోలీసులను అప్పట్లోనే ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈనెల 1న తుల్జా భవానీ రెడ్డి, ఆమె భర్త రాహుల్ రెడ్డిపై 186, 505 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇదిలా ఉండగా ఈ కేసు విషయాన్ని నేటికీ పోలీసులు సిక్రెట్గా ఉంచుతున్నారు.