బంగ్లా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆరోపణలతో.. షేక్ హసీనాపై కేసు

బంగ్లా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆరోపణలతో.. షేక్ హసీనాపై కేసు

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్​లో ముహమ్మద్ యూనస్  నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారన్న ఆరోపణలపై  మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో 72 మందిపై బంగ్లాదేశ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఢాకా చీఫ్​ మెట్రోపాలిటన్  మేజిస్ట్రేట్  కోర్టులో  క్రిమినల్  ఇన్వెస్టిగేషన్  డిపార్ట్ మెంట్(సీఐడీ) ఈ మేరకు కేసు దాఖలు చేసిందని, కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. 

నిరుడు డిసెంబరు 19న ఆన్​లైన్​లో షేక్  హసీనా మద్దతుదారులు సమావేశమై ‘జోయ్  బాంగ్లా బ్రిగేడ్’ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేశారని, దేశంలో సివిల్  వార్  ద్వారా యూనస్  ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చర్చలు నిర్వహించారని సీఐడీ పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని విధులు నిర్వహించకుండా అడ్డుకోవాలని ఆ మీటింగ్​లో పాల్గొన్న వారు చర్చించారని సీఐడీ తన పిటిషన్​లో  తెలిపింది.

బంగ్లాదేశ్ తో పాటు విదేశాల నుంచి మొత్తం 577 మంది ఆ సమావేశంలో పాల్గొన్నారని, హసీనా ఆదేశాలకు మద్దతు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన  అవామీ లీగ్ అమెరికా విభాగం ఉపాధ్యక్షుడు ఆలంను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చామని వెల్లడించారు.