హరిచంద్రపురంలోని ఇండ్ల వీడియో వైరల్
యువకులపై హౌసింగ్ ఏఈ ఫిర్యాదు
కామేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం హరిచంద్రపురం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నాణ్యతను ప్రశ్నించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదంగా మారుతోంది. లబ్ధిదారులకు పంపిణీ చేయకుండానే శ్లాబ్ పై సిమెంట్ పెచ్చులూడుతుండడం, సెంటీమీటర్ మందంలోపు ఉన్న శ్లాబ్ లో కాంక్రీట్ లేకుండా ఇసుక మాత్రమే బయటకు వస్తుండడంపై కామేపల్లి మండలానికి చెందిన వాట్సప్గ్రూప్ లో ఇద్దరు యువకులు వీడియో తీసి పోస్ట్ చేశారు. అది కాసేపట్లోనే వైరల్ గా మారింది. నిరక్ష్ల్యంగా పనులు చేసిన కాంట్రాక్టర్, నాణ్యతను పట్టించుకోని అధికారుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆయనకే వంత పాడడం విమర్శలకు తావిస్తోంది. అక్రమంగా ప్రవేశించారని, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా వ్యవహరించారని హౌసింగ్ ఏఈ యూసుఫ్ అలీ ఫిర్యాదు చేయడంతో వీడియోను వైరల్ చేసిన మాధవరెడ్డితో పాటు వీడియో తీసిన జాటోత్ రాంబాబు, బోడ నరేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇండ్లకు మరమ్మతులు
హరిచంద్రపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కాంట్రాక్టర్ మరమ్మతులు చేయించారు. ‘వెలుగు’ దినపత్రికలో ‘జనం చేతికి అందకుండానే డబుల్ ఇండ్లు పెచ్చులూడుతున్నయ్’ హెడ్డింగ్ తో శుక్రవారం వార్త రావడం, వీ6 చానల్ లో స్టోరీ ప్రసారం కావడంతో స్పందించిన కాంట్రాక్టర్ పెచ్చులూడిన చోట సిమెంట్ చేయించారు. కారేపల్లి రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై స్రవంతి దగ్గరుండి పనులను పరిశీలించారు.
కాం ట్రాక్టర్ పై చర్య తీసుకోకుండా మాపై కేసులా
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నాణ్యతగా లేవని దీనిని ఆఫీసర్లు, కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాం. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా నాణ్యత లోపాన్ని ప్రశ్నించిన మాపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం. ఉన్నత చదువులు చదువుకొని,
ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళ్తున్నాం. వీడియో వైరల్ చేసిన మాధవరెడ్డితో మాకెలాంటి సంబంధం లేదు. కేసులతో మా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు భయపడుతున్నారు . కేసులతో మా జీవితం నాశనం అవుతుం ది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ జోక్యం చేసుకోవాలి.‑జాటోత్ రాంబాబు, బోడ నరేష్
గవర్నర్ జోక్యం చేసుకోవాలి
తప్పుని ఎత్తిచూపిన యువకులను అభినందించకుండా, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కాంట్రాక్టర్, అధికారులకు వత్తాసు పలుకుతున్న కామేపల్లి పోలీసుల తీరు దారుణం. రాష్ట్రంలో గిరిజనులపై వరుసగా దాడులు జరుగుతున్నా ఏ మాత్రం పట్టక, నోరు మెదపకుండా ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలి. గిరిజనులకు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి. ‑రాజ్ కుమార్ జాదవ్, గిరిజన, లంబాడీల ఐక్యవేదిక అధ్యక్షుడు