- స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం
- పోయిన నెల 15నే పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు
- ఆమెను స్వధార్ హోమ్‌కు పంపి చేతులు
- దులుపుకున్న పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు
- మీడియాలో వార్తలు రావడంతో గంజాయి ముఠాలపై దృష్టి
కరీంనగర్/జగిత్యాల, వెలుగు: స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి, అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. జగిత్యాల పట్టణానికి చెందిన బాధితురాలు తన స్నేహితురాలి ద్వారా స్థానికంగా ఉండే ఓ బాలుడికి పరిచయమైంది. ఈ క్రమంలో అతడు ఆ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి... తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లి ఆమెతో బలవంతంగా గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాధితురాలికి గంజాయి ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం.
ఇట్లనే ఇంకో వ్యక్తి కూడా తన ఇంటికి తీసుకెళ్లి ఆమెకు గంజాయి తాగించి రేప్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయమై జగిత్యాల డీఎస్పీని వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని, సోమవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
మొదటి నుంచీ నిర్లక్ష్యం..
తన కూతురు గంజాయికి అడిక్ట్ కావడంతో కొందరు లైంగికంగా వేధింపులకు గురిచేశారని బాధితురాలి తండ్రి పోయిన నెల 15న జగిత్యాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని వారం రోజులు స్టేషన్ చుట్టూ తిరిగారు. కానీ దీనిపై విచారణ చేయడంలో అప్పటి సీఐ నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీసులతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్ పర్సన్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్(డీసీపీఓ), చైల్డ్ లైన్ సిబ్బంది కూడా చర్యలు చేపట్టాల్సి ఉంది.
కానీ బాధితురాలిని ఈ నెల 4న స్వధార్ హోమ్‌కు పంపి, వాళ్లందరూ తమ పనైపోయిందనే ధోరణిలో వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతసేపు తప్పంతా బాధితురాలు, ఆమె తల్లిదండ్రులపైనే మోపి.. ఆ బాలికకు గంజాయి అలవాటు కావడానికి కారణమేంటి? ఇంకా ఆమెలాగా బాధితులు ఎవరైనా ఉన్నారా? అనే దానిపై దృష్టిపెట్టలేదు. స్వధార్ హోమ్‌కు బాలికను తరలించాక బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయాల్సిన డీసీపీఓ.. అసలు ఆ విషయాన్నే పట్టించుకోకపోవడం గమనార్హం.
బాధితురాలికి గత 20 రోజులుగా కౌన్సెలింగ్ ఇస్తూ ఆమె కోలుకునేందుకు స్వధార్ హోమ్ ఇన్ చార్జ్ ప్రయత్నిస్తున్నారు. బాలిక ద్వారా తనకు తెలిసిన కొన్ని విషయాలను స్వధార్ హోమ్ ఇన్ చార్జ్ మీడియా ప్రతినిధులకు వెల్లడించినందుకు... ఓ పోలీసాఫీసర్ మీడియా ఎదుటే ఆమెను బెదిరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా గంజాయి స్మగ్లర్లు, బాధితులను గుర్తించి.. చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
మీడియాలో వార్తలు రావడంతోనే చర్యలు..
ఈ కేసులో అటు పోలీస్ శాఖ, ఇటు ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అధికారులు మొదటి నుంచీ నిర్లక్ష్యం ప్రదర్శించారు. బాలిక దుస్థితిపై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, సెన్సేషన్ కోసమే ఇలా చేస్తున్నారని చివరి నిమిషం వరకు బుకాయించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మీడియాలో వార్తలు రావడంతోనే గంజాయి ముఠాలపై దృష్టిపెట్టిన పోలీసులు.. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు.