నకిలీ డాక్యుమెంట్లతో రూ. 50 కోట్ల రుణం అప్లై

నకిలీ డాక్యుమెంట్లతో రూ. 50 కోట్ల రుణం అప్లై
  • నకిలీ పత్రాలు సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ సునీత

ఇబ్రహీంపట్నం, వెలుగు: రూ.50  కోట్ల రుణం కోసం నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీత పోలీసులకు కంప్లైంట్ చేశారు.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్  గ్రామంలో సర్వే నంబరు131 నుంచి 166  వరకు గల భూమికి చెందిన కొన్ని డాక్యుమెంట్లు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీస్ నుంచి జారీ చేసినట్లు నకిలీవి సృష్టించారు.

ఇబ్రహీంపట్నం తహసీల్దార్ స్టాంపు, డిప్యూటీ తహసీల్దార్ సంతకం చేసినట్లు వసుంధర ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్ షిప్, రిసార్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ రూ. 50 కోట్ల రుణం కోసం ముంబయి లోని ది సిండికేట్ ఫైనాన్స్ బ్యాంకును సంప్రదించారు. నిర్దారణ కోసం అక్కడి బ్యాంకు సిబ్బంది ఎమ్మార్వో కార్యాలయానికి పత్రాలను పంపించగా.. వాటిని పరిశీలించిన తహసీల్దార్ సునీత అవి నకిలీవి అని తేల్చారు.  తాము ఎలాంటి అనుమతి పత్రాలు ఇవ్వకుండా ఇలా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ఆ సంస్థ ప్రతినిధులు రావి చక్రధర్, రావి శ్రీనివాస్ రావు తదితరులపై తహసీల్దార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు వారిపై నమోదు చేశారు.