ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు వసూలు

కరీంనగర్ క్రైం, వెలుగు: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళ నుంచి డబ్బులు వసూలు చేసి తప్పుడు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తయారు చేసి ఇచ్చి మోసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్​ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. కమాన్‌వద్ద ఫంక్షన్‌ హాల్‌లో పనిచేస్తున్న చొప్పదండి మండలం చాకుంటకు చెం దిన సలీంకు జగిత్యాల జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న మంద సతీశ్​కుమార్, గట్టుదుద్దెనపల్లికి చెందిన మ్యాకల శ్రవణ్ తో పాటు కమాన్‌ కు చెందిన మరో ఇద్దరు పరిచయమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే తమకు చెప్పాలని వారు సలీంతో చెప్పడంతో తన భార్యకు ఉద్యోగం కావాలని కోరాడు.

డబ్బులు ఖర్చువుతాయని చెప్పి సలీం దగ్గర రూ. 8లక్షలు వసూలు చేశారు. అప్పటి నుంచి దాటవేసుకుంటూ రావడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో జిల్లా పంచాయతీరాజ్‌ ఆఫీస్​లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని ఫేక్​ అపాయింట్​మెంట్​ ఆర్డర్​ తయారుచేసి అందించారు. దాన్ని తీసుకుని అక్కడికి వెళ్లగా అది ఫేక్​ అని తేలింది. దీంతో సలీం నిందితులను తన డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరింపులకు దిగారు. సలీం కంప్లైంట్​ చేయగా నిందితులపై కేసు నమోదు చేశారు.