- డీజే, డ్రోన్లు వినియోగిస్తే సీజే
- అధికార, ప్రతిపక్షం తేడా లేకుండా కొరడా ఝళిపిస్తున్న పోలీసులు
- అవగాహన లేక కేసుల పాలవుతున్న నాయకులు, కార్యకర్తలు
- కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 10 రోజుల్లో 61 కేసులు
కరీంనగర్, వెలుగు : ఎన్నికల నియమావళిపై అవగాహన లేక పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తున్న పనులు వారికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ప్రచారంలో హడావుడి చేసేందుకు పటాకులు కాల్చినా పోలీసులు కేసులు పెడుతున్నారు. అనుమతి లేకుండా డీజేలు, డ్రోన్లు వినియోగిస్తే సీజ్ చేస్తున్నారు. ముందస్తు పర్మిషన్ తీసుకున్నప్పటికీ కార్యకర్తలు, జనాలు రావడం లేట్ కావడం వల్ల ఇచ్చిన టైంకు మించి ప్రచారం నిర్వహించి కేసుల పాలవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 1 నుంచి 3 వరకు 17 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గడిచిన వారం రోజుల్లో మరో 44 కేసులు నమోదు చేశారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులకు తీతంగా కేసులు నమోదు చేస్తుండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు బెంబేలెత్తుతున్నారు.
నమోదైన కేసుల్లో కొన్ని..
మానకొండూరులో
- మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన మానకొండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వల ప్రదీప్ రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఇడుముల సంపత్ గత శుక్రవారం అనుమతి లేకుండా ప్రచారం చేసినందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
- మానకొండూరు ఎమ్మెల్యే అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు కవ్వంపల్లి అనురాధ, ముద్దసాని సులోచన, రవీంద్రచారి, ముసుగు ఉపేందర్ రెడ్డి జగ్గయ్యపల్లిలో ఇంటింటి ప్రచారం కోసం అనుమతి తీసుకుని, 40 మందితో ర్యాలీగా ప్రచారం నిర్వహించినందుకు కేసు పెట్టారు.
- మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్, రామకృష్ణ 300 మందితో ర్యాలీ నిర్వహించి పటాకులు కాల్చారని కేసు నమోదైంది.
- మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ, రామకృష్ణ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు స్థానికంగా 200 మందితో పర్మిషన్ లేకుండా సమావేశం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.
- మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ, గొట్టెముక్కల సంపత్ రెడ్డి, ముస్కు ఉపేందర్ రెడ్డి గత సోమవారం పది మందితో ఇంటింటి ప్రచారం కోసం అనుమతి తీసుకుని 300 మందితో ర్యాలీ నిర్వహించినందుకు కేసు నమోదైంది.
- తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామ సర్పంచ్ మామిడి సతీష్, ఎంపీటీసీ పుప్పాల కనకయ్య, పుప్పాల సతీష్ గత శుక్రవారం పర్మిషన్ లేకుండా సమావేశం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.
- మానకొండూరు మండలంలోని నిజాయితీగూడెంకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు సామంతుల శ్రీనివాస్ అనుమతి లేకుండా ఇంటింటి ప్రచారం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.
- మానకొండూరు బీజేపీ నేతలు ఆరేపల్లి మోహన్, వి.రమేష్ నామినేషన్ ర్యాలీకి ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి తీసుకొని టైం దాటినా సమావేశం ఏర్పాటు చేసినందుకు కేసు నమోదు చేశారు.
- మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ, మురళి మోహన్ రెడ్డి, మోరేపల్లి రమణారెడ్డి కరీంనగర్ హైవేపై 30 మందితో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.
కరీంనగర్లో
- ‘ఇండియా నౌ’ అనే యూట్యూబ్ చానెల్ లో శనివారం ‘గంగుల గ్యాంగ్ చేసిన గాయం’ అనే కథనాన్ని ప్రచారం చేసి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఆ యూట్యూబ్ చానల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్, హరిశంకర్, సునీల్ రావు ఎన్నికల ప్రచారానికి వాడిన వీడియోను, వారిని కించపరిచే విధంగా మార్ఫింగ్ చేసి తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడ్డారని మానకొండూరుకు చెందిన కొత్తకొండ వెంకటసాయిపై కేసు నమోదు చేశారు.
- కొత్తపల్లికి చెందిన బీజేపీ లీడర్లు నాంపల్లి శ్రీనివాస్, దుబ్బాక శ్రీనివాస్ గత శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మీటింగ్ కు పర్మిషన్ తీసుకొని, సమయం దాటినా మీటింగ్ కొనసాగించినందుకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
- కరీంనగర్ లోని స్థానిక బీజేపీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ఎలాంటి అనుమతి లేకుండా ఇంటింటి ప్రచారం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.
- కరీంనగర్ లోని సవరన్ స్ట్రీట్ కు చెందిన బండారి నరేందర్ రావు స్థానిక ప్రతిమ కన్వెన్షన్ లో డాక్టర్స్ కు సంబంధించిన మీటింగ్ కోసం అనుమతి తీసుకుని బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, ఆయన అనుచరులు ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.
- కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను వినియోగించినందుకు కరీంనగర్ బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పై కేసు నమోదు చేశారు.
- కరీంనగర్ లోని ఒక ప్రైవేటు హోటల్ లో అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి బైండోవర్లపై అవాస్తవాలు మాట్లాడినందుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పై కేసు నమోదు చేశారు.
- కరీంనగర్ కు చెందిన బీజేపీ నాయకుడు తణుకు సాయికృష్ణ ఓ ఫంక్షన్ హాల్ లో ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకొని, టైం దాటినా సమావేశం కొనసాగించినందుకు సాయికృష్ణతోపాటు ఫంక్షన్ హాల్ యజమానిపైనా కేసు నమోదు చేశారు.
చొప్పదండిలో
- కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం నామినేషన్ సందర్భంగా వంద మోటార్ సైకిళ్లు, 3 వేల మందితో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పర్మిషన్ తీసుకున్నా 5 వేల మందితో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య ర్యాలీ నిర్వహించి, అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేసి, డీజే, డ్రోన్లు వినియోగించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే వెహికిల్ ను సీజ్ చేశారు.
- చొప్పదండి బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ లక్క రాజేశ్వర్ రెడ్డి స్థానిక 4, 5, 6వ వార్డులో ఎన్నికల ప్రచారం కోసం అనుమతి తీసుకుని, టపాకాయలు పేల్చినందుకు కేసు నమోదు చేశారు.
హుస్నాబాద్..
- హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్.. ఓబులాపూర్ పల్లి, చిన్న ముల్కనూరు గ్రామాల్లో టైంకు మించి ప్రచారం కొనసాగించడమేగాక పటాకలు పేల్చారని పోలీసులు కేసు నమోదు చేశారు.
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుస్నాబాద్ జడ్పీటీసీ పిట్టల రవి, మేడి మహేష్, బుర్ర సోమయ్య, తాటిపల్లి సురేందర్ బోరు బావి నీళ్ల మోటారును స్థానికులకు పంపిణీ చేసినందుకు కేసు ఫైల్ అయింది.
హుజూరాబాద్‌లో
- హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం పర్మిషన్ తీసుకుని టపాకాయలు కాల్చినందుకు రాగి విజయకుమార్, గద్దల శ్రీధర్ పై కేసు నమోదు చేశారు.
- ఇల్లంతకుంట మండలంలోని లక్ష్మాజిపల్లికి చెందిన జీవన్ రెడ్డి, ములుగు పూర్ణచందర్ అనుమతి లేకుండా బీఆర్ఎస్ జెండాలు కట్టినందుకు కేసు పెట్టారు.
- ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లెకు చెందిన మోరే స్వామి, ఎద్దులాపురం నరేందర్, బేతిగల్ కు చెందిన సంపత్ రావు అనుమతి లేకుండా బేతికల్ లో బీజేపీ జెండాలు కట్టినందుకు కేసు నమోదు చేశారు.
- రంగాపూర్ గ్రామానికి చెందిన బండ రాజు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారంలో అనుమతి లేకుండా పటాసులు పేల్చినందుకు కేసు నమోదు చేశారు.