అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కేసు

  • ఐపీసీ 504,505 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు

హైదరాబాద్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా  మూడు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. అసోం సీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేయనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల ముందు నిరసనలు నిర్వహించాలని కోరింది. పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఇళ్ల నుంచి బయటకు రాకముందే హౌస్ అరెస్టులు చేశారు. అలాగే బయలుదేరిన వారిని మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు
హైదరాబాద్ కమిషనరేట్ దగ్గర నిరసన చేపడతామని ప్రకటించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రి నుంచే రేవంత్ ఇంటి దగ్గర పోలీసు బలగాలను మొహరించారు. అలాగే రాచకొండ కమిషనరేట్ దగ్గర నిరసనలో పాల్గొంటానని ప్రకటించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కూడా గృహ నిర్బంధం చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ నేతలందరినీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో స్పందించి కేసు నమోదుకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఐపీసీ 504,505 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.