చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపులో గోల్ మాల్.. 21 మందిపై కేసులు

చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపులో గోల్ మాల్.. 21 మందిపై కేసులు

చిత్రపురి కాలనీ.. ఈ పేరులోనే ఉంది అసలు మ్యాటర్. ఆ ప్రాంతంలో నిర్మించిన ప్లాట్లను చిత్రసీమ(సినీ పరిశ్రమ)కు చెందిన అల్పాదాయ వర్గాల వారికి కేటాయించాలని. కానీ అక్కడ జరిగింది వేరు. అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా.. వాటిని బ‌య‌టి వారికి కట్టబెట్టి అడ్డగోలుగా దోచుకున్నారు.

చిత్రపురి కాలనీలోని ప్లాట్ల కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని, కమిటీ సభ్యులకు కాకుండా బ‌య‌టి వారికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు గతంలోనూ వార్తలొచ్చాయి. అప్పటి బీఆర్ఎస్ నాయకులకు స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ చెరువులు, నాలాలు కబ్జా చేసినవారిపై హైడ్రా పేరుతో కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్రమాల వ్యవహారం మరోసారి బయటకొచ్చింది.

ఈ ఆరోపణలపై గతంలో చిత్రపురి కాలనీ కమిటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్రమ వ్యాపారం విలువ వందల కోట్లలో ఉన్నట్లు తేలడంతో ఈ కేసును ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW)కి బదిలీ చేశారు. వారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుత మరియు పాత కమిటీలో మెంబర్లుగా ఉండి కీలక పాత్ర వహించిన 21 మందిపై సెక్షన్ 120B కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

Also Read :- అక్రమ నిర్మాణాలు అన్నింటినీ కూల్చేస్తాం

కేసులు నమోదైన వారి జాబితా

కేసులు నమోదైన వారిలో అనిల్ కుమార్ యాదవ్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్, ఆలహరి వివి ప్రసాద్, కొంగర రామకృష్ణ, వినోద్ బాల, ప్రవీణ్ యాదవ్, సత్యనారాయణ దోరా, దీప్తి వాజపేయి, టీ.లలిత, అనిత నిమ్మగడ్డ, రఘు బత్తుల, మహేంద్ర రెడ్డి, జెల్లా మధుసూదన్, పీఎస్ కృష్ణ మోహన్ రెడ్డి, కె.రాజేశ్వరరెడ్డి, చంద్రమధు, దేవినేని బ్రహ్మానందరావు, కొల్లి రామకృష్ణ, కె.ఉదయ భాస్కరరావులు ఉన్నారు.