మేడిగడ్డపై డ్రోన్ వీడియో.. కేటీఆర్ పై కేసు

మేడిగడ్డపై డ్రోన్ వీడియో.. కేటీఆర్ పై కేసు
  • బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిపై కూడా.. 

జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్ పూర్ వెలుగు: మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన టైమ్ లో డ్రోన్ వీడియో తీసినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని గత నెల 26న బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఆ టైమ్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు కొందరు డ్రోన్ ఎగురవేసి మేడిగడ్డ బ్యారేజీ వీడియోలు తీశారు. ఆ వీడియోలను యూట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అప్ లోడ్ చేశారు.

మేడిగడ్డ బ్యారేజీకి ఏం కాలేదని, పెద్ద ఎత్తున వరద వచ్చినా తట్టుకున్నదని, ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తున్నదని ప్రచారం చేశారు. అయితే డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరణకు బీఆర్ఎస్ ముందస్తు అనుమతి తీసుకోలేదని.. బ్యారేజీకి ముప్పు వాటిల్లే విధంగా ప్రవర్తించినందుకు బాధ్యులైన కేటీఆర్, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ప్రభుత్వ ఇంజినీర్ గత నెల 29న మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.