కరీంనగర్ క్రైం, వెలుగు : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి పై కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆదివారం ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నందున ఎలక్షన్ కోడ్‌తో పాటు 144 సెక్షన్ అమలో ఉంది. ఎవరూ గుంపులుగా ఉండకూడదని అక్కడ డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బోనాల అంజిరెడ్డి.. కౌశిక్ రెడ్డి అనుచరులకు చెప్పారు.
అయినా, కౌశిక్ రెడ్డి వినకుండా అంజిరెడ్డి డ్యూటీకి ఆటంకం కలిగించాడు. అంజిరెడ్డితో పాటు అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిని నెట్టివేసి ఇష్టంవచ్చినట్లు బూతులు తిడుతూ అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ బోనాల అంజిరెడ్డి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లయింట్ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కౌశిక్ పై కేసు నమోదు చేశారు.