డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.  ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేసే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని కాలితో తన్ని, కారుతో ఢీకొట్టిందని ఆమెపై  కేసు నమోదైంది.  జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు డింపుల్ హయతి, రాహుల్ హెగ్డే.  

అయితే పార్క్ చేసిన రాహుల్ కారును డింపుల్ హయతి కాలితో తన్నడంతో పాటుగా ఆమె ఫ్రెండ్ డేవిడ్ తో కలిసి  ఢీ కొట్టిందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.   రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద పోలీసులు  కేసు నమోదు చేశారు. 

ఇప్పుడే కాదని డింపుల్ పలుమార్లు ఇలాగే ప్రవర్తించిందని రాహుల్ తన  ఫిర్యాదులో తెలిపారు. నచ్చజెప్పేందుకు పలుమార్లు ఫయత్నించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదట. దీంతో ఫిర్యాదు చేసినట్టుగా రాహుల్  వెల్లడించారు. దీంతో డింపుల్ తో పాటుగా డేవిడ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు  పోలీసులు.  

ఇద్దర్ని ఈ విషయంలో హెచ్చరించి CRPC 41a కింద నోటీసులు ఇచ్చి, మరోసారి విచారణకు అవసరమైతే రావాలని చెప్పి పంపించారు. ఇక  ఖిలాడి, రామబాణం చిత్రాలతో డింపుల్ హయతి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.