పాత కక్షలతో కొట్టుకున్నరు.. 28 మంది పై కేసు నమోదు

హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పాత కక్షలతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం...ఏపీలోని జగ్గయ్యపేట నుంచి కొన్నేండ్ల కింద మద్దెల బాలస్వామి ,శీలం పోలయ్య కుటుంబాలు హుజూర్ నగర్ కు వలస వచ్చి ప్రభుత్వ కాలేజీ సమీపంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. వీరు శుభకార్యాలకు  మండపాల డెకరేషన్ పనులు చేస్తుంటారు. వ్యాపారంలో వచ్చిన విబేధాలతో రెండు వర్గాలుగా విడిపోయి డెకరేషన్ వ్యాపారం చేస్తున్నారు. అప్పుడప్పుడు గొడవలు పడి  పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకునేవారు. 

గత నెల 31 రాఖీ పండుగ రోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి వచ్చిన బంధువులతో కలిసి మద్యం తాగే సమయంలో వైన్స్ వద్ద ఘర్షణ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల1న శీలం నాగేశ్వర్​రావు, శీలం గోపి ఇంకొంతమంది కలిసి మద్దెల బాలస్వామి ఇంటికి వచ్చి గొడవకు దిగారు. బాలస్వామి కొడుకు లాజర్, కోడలు సల్మా బేగం, ఇతర  కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో బాలస్వామి భార్య మేరీ పీఎస్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కుల పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పి ఇంటికి  తీసుకెళ్లారు. ఆదివారం ఇరువర్గాలు పంచాయితీ పెట్టి మాట్లాడుకుంటుండగా మాటామాట పెరిగి  మద్దెల బాలస్వామి ఇంటిపై ఇనుప రాడ్లు , రాళ్లు, కర్రలు, కత్తులతో శీలం నాగేశ్వర్​రావు వర్గీయులు దాడి చేశారు. 

ఈ దాడిలో బాలస్వామి, ఇతడి కోడలు సల్మా బేగం తీవ్రంగా గాయపడ్డారు. మద్దెల లాజర్, మద్దెల మర్ధ, ఓబురాయి భవాని ప్రసాద్, ఓబురాయి పద్మావతి, ఓబురాయి ధనరాజ్, మునీర్ స్వల్ప గాయాలయ్యాయి. భయపడ్డ కాలనీ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి గాయపడ్డ వారిని ఏరియా దవాఖానకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా దవాఖానకు తరలించారు. 28 మందిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరికృష్ణ  తెలిపారు.