- ఆఫీసర్లను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ
తాడ్వాయి/వరంగల్ సిటీ, వెలుగు: డ్యూటీలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లపై ఐదుగురు వ్యక్తులు దాడి చేయడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్‌కుమార్, బీట్ ఆఫీసర్లు శరత్ చంద్ర, సుమన్, బేస్ క్యాంప్ ఉద్యోగి ఎట్టి శ్రీను, డ్రైవర్ రాజేందర్ గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దామరవాయి గ్రామ సమీపంలో ఓ జేసీబీ ఎదురుకావడంతో దానిని ఆపి, వాహనాన్ని ఫారెస్ట్ ఆఫీస్‌కు తీసుకురావాలని డ్రైవర్లను ఆదేశించారు.
ఈ విషయాన్ని జేసీబీ డ్రైవర్లు నీరటి శ్రీకాంత్, మాదరి చంటి ఓనర్ అయిన గంట సురోజ్‌రెడ్డికి చెప్పారు. దీంతో సురోజ్ రెడ్డి, గంటా శశిధర్, పాండవుల సాయి నాంపల్లి సమీపంలో జేసీబీ తీసుకెళ్తున్న ఆఫీసర్లను అడ్డుకొని తమ వాహనాన్ని ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు.
రిజర్వ్ ఫారెస్ట్‌లో జేసీబీతో మొట్లు తీస్తున్నారన్న సమాచారం అందడంతో ఫారెస్ట్ ఆఫీస్‌కు తరలిస్తున్నామని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, సురోజ్‌రెడ్డి వర్గం మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు కొట్టుకోవడంతో గాయాలు అయ్యాయి.
విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో కృష్ణవేణి తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన సెక్షన్ ఆఫీసర్ వినోద్‌కుమార్, బీట్ ఆఫీసర్లు శరత్ చంద్ర, సుమన్, సిబ్బందిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.
అనంతరం మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం వరంగల్ తరలించారు. శుక్రవారం ఉదయం ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో కృష్ణవేణి, ఫిర్యాదుతో జేసీబీ ఓనర్ గంట సురోజ్‌రెడ్డి, గంట శశిధర్, పాండవుల సాయి, డ్రైవర్లు నీరటి శ్రీకాంత్, చంటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి కొండా సురేఖ
వరంగల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లను శుక్రవారం మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్‌మెంట్ చేయాలని డాక్టర్లకు సూచించారు. గొడవకు కారణమైన పరిస్థితులను డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్‌ను అడిగి తెలుసుకున్నారు.
అటవీ సంపద పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.